మహా అంటే రాజకీయ పార్టీలకు అందులోనూ అధికార పార్టీకి కొంత వరకూ లాభం ఏమో కానీ... కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఎమ్మెల్సీల సంఖ్యను పెంచడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదని చెప్పాలి. ప్రస్తుతం 50 స్థానాలున్నా ఏపీ శాసనమండలిలో ఎనిమిది సీట్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అయితే దీని వల్ల ఏపీకి ఏదో లాభం కలిగిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇక తెలంగాణ వాళ్లు గగ్గోలు పెట్టేస్తున్నారు. అయితే ఈ పరిణామం వల్ల ఏపీ ప్రజలకు దక్కేదేమీ లేదు, తెలంగాణ ప్రజలు నష్టపోయేదేమీ ఉండదు. కేవలం రాజకీయ పార్టీలకు మాత్రమే ఇది ఉపయుక్తమైనది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన తమ పార్టీ నేతలకు ఇప్పుడు బాబు ఉద్యోగాలు ఇస్తాడు. ఎమ్మెల్సీ సీట్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వారికి పదవులు ఇవ్వడానికి ఏపీ ముఖ్యమంత్రికి అవకాశం ఏర్పడుతుంది. అసంతృప్తి లేకుండా పదవులు పంపకానికి అవకాశం ఉంటుంది. అంతే గానీ జనాలకు మాత్రం ఏం లాభం ఉండదు. ఇలా ఎమ్మెల్సీల సంఖ్య పెరగడం వల్ల ప్రభుత్వ ఖజానాకు మరో భారం. వాళ్లకు జీతభత్యాలు, ఇతర సౌకర్యాల రూపంలో మరింత ఖర్చు అవుతుంది. ఓవరాల్ గా ఏపీ విషయంలో కేంద్రం తీసుకొన్న ఈ నిర్ణయం వల్ల జనాలకు వచ్చేది అయితే ఏమీ ఉండదు. ఈ విషయంలో తెలంగాణ వాళ్ల కు నష్టం కూడా లేదు. లాభం అంతా రాజకీయ పార్టీలకు మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: