రెండు వారాల క్రితం వరకూ కిలో టమోటా ధర రూ.20 నుంచి రూ.30 మధ్య ఉంది. మరి ఇప్పుడో రూ.5 నుంచి రూ.7కు దిగింది. ఇది హైదరాబాద్ లోని పరిస్థితి. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవటంతో పంట దిగుబడి గణనీయంగా పెరగటమే ఇందుకు కారణం. ఇదే సమయంలో ధర లేక రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. టమోటా అత్యధికంగా పండే చిత్తూరు, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో రైతులు తమ పంటకు కనీస ధర రాక మార్కెట్ యార్డ్ కు తెచ్చిన టమోటాలను అక్కడే పడేసి పోతున్న పరిస్థితి నెలకొంది. మదనపల్లి హోల్ సేల్ మార్కెట్లో కిలో టమోటా ధర రూపాయి కన్నా దిగువకు పడిపోయింది. దీంతో, పంటను మార్కెట్ కు తరలించేందుకు పెట్టిన వాహనం కిరాయి కూడా రాలేదని రైతులు వాపోయారు. సరైన స్టోరేజ్ సదుపాయాలూ లేకపోవడంతో క్వింటాళ్లకు క్వింటాళ్లు రోడ్డుపై పారేయాల్సి వస్తోందని ఓ రైతు విలపించాడు. ఎకరా టమోటా సాగుకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలీల ఖర్చుతో రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పెట్టుబడి అవుతుండగా, ఈ సీజన్లో రూ.2 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. కాగా, టమోటా ధర మరింతగా పడిపోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: