తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపీకు పదేళ్ల ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ తరపున వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారని, ఆయన హామీ నేటివరకు అమలు కానందుకు రాష్ట్ర ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పి, పదవికి రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. గురువారం విజయవాడలో ఆయ న విలేకరులతో మాట్లాడారు. ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ-బీజేపీ పాత్ర-వాస్తవాలు’, ‘అవిశ్రాంత పోరాట యోధుడు’ అనే పుస్తకాలు ప్రచురించి విశాఖపట్నం నుం చి తిరుపతి దాకా సన్మానాలు చేయించుకున్న వెంకయ్యనాయుడు తన పుస్తకాలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి చం ద్రబాబునాయుడు ఒంటెత్తుపోకడలతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా పోలవరం, రుణమాఫీ, రాజధాని నిర్మాణం వంటి ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని ఆయన చెప్పారు. జనవరి నుంచి తమ పార్టీ మహాసభలు 13 జిల్లాల్లో జరుగుతాయని, మార్చి 3,4 తేదీలలో విజయవాడ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తామని, ఆ సభలో ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: