రాష్ట్రానికి రాజధాని నిర్మాణం ఇప్పుడు అత్యంత కీలకం. ఇందులో రెవెన్యూశాఖ, మున్సిపల్ శాఖల పాత్ర మరీ ప్రధానం. అయితే రాష్ట్రంలో రెండు ప్రధాన శాఖల మధ్య నెలకొన్న అంతర్గత వివాదం రాజధాని నిర్మాణంపై ప్రభావం చూపిస్తోంది. రెవెన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి, మున్సిపల్ మంత్రి నారాయణ మధ్య బంధాలు అంతంతమాత్రంగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజధాని నిర్మాణంలో అంతా తానై నారాయణ వ్యవహరిస్తున్నారంటూ కెఇ అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. భూమిని సేకరించడం రెవెన్యూ శాఖ పరిధిలో ఉండగా, దానిని అభివృద్ధి చేయడం మున్సిపల్ శాఖకు వర్తిస్తుంది. అయితే రాజధాని నిర్మాణంలో మాత్రం భూమి సేకరణను కూడా మున్సిపల్ శాఖకే అప్పగించారు. దీంతో క్షేత్ర స్థాయిలో రెవెన్యూ ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ ఆ శాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి మాత్రం నామమాత్రంగా మిగిలిపోయారు. అదే ఇప్పుడు ఆయనలో అసంతృప్తికి కారణంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అప్పుడప్పుడు ఆయన చేస్తున్న సంచలన వ్యాఖ్యలకు కూడా ఇదే కారణంగా కనిపిస్తున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. విభజన అనంతరం రాజధానిని కర్నూలులో పెట్టాలని ఆ ప్రాంత ప్రజలు పెద్దయెత్తున ఉద్యమాలు చేశారు. వారికి కెఇ కూడా కొంత మద్దతుగానే నిలిచారు.  అయితే రాష్ట్రానికి మధ్య ప్రాంతంలో రాజధాని ఉండాలని, గుంటూరు-విజయవాడ ప్రాంతం అనుకూలంగా ఉంటుందని భావించిన ముఖ్యమంత్రి కర్నూలువాసుల ఆందోళనను తగ్గించే బాధ్యతను కెఇపైనే ఉంచారు. అప్పటినుంచే కెఇలో కొంత అసంతృప్తి ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. తన వారికి తానే నచ్చచెప్పుకుని రాజధానిని గుంటూరు ప్రాంతానికి తరలించాల్సి రావడంతో కర్నూలులో ఆయన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నట్లు సమాచారం. అప్పటినుంచే ఆయన ముభావంగా ఉండడం, అప్పుడప్పుడు తన అసంతృప్తిని వ్యక్తం చేయడం జరుగుతోందని ప్రచారం. తరువాత కాలంలో రెవెన్యూ పనులను కూడా మున్సిపల్ శాఖ ముందుకు తీసుకువెళ్లేలా పరిణామాలు మారడం కెఇలో ఉన్న అసంతృప్తిని మరింతగా పెంచేందుకు దోహదం చేసినట్లు భావిస్తున్నారు. రాష్టవ్య్రాప్తంగా రెవెన్యూ వ్యవహారాలు ఆ శాఖే చూస్తున్నప్పటికీ... రాజధాని ప్రాంతంలో రెవెన్యూ వ్యవహారాలు మాత్రం మున్సిపల్ శాఖకు అప్పగించడంతో కెఇ, నారాయణ మధ్య అగాధం పెరిగినట్లు కనిపిస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించిన భూసేకరణకు సంబంధించిన కమిటీల్లో కూడా కెఇ లేకపోవడం గమనార్హం. కర్నూలు రాజధాని చేయాలన్న అక్కడి వారి డిమాండ్లు ఉన్న సమయంలో కెఇ కమిటీలో స్థానంపై విముఖత వ్యక్తం చేసారని, తరువాత ఇక ఏ కమిటీలోనూ ఆయనకు అవకాశం కల్పించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడినా.. తన అసంతృప్తిని కెఇ వ్యంగ్యోక్తులతో వెల్లడిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. శాసనసభలో మంత్రులు మాట్లాడేందుకు ముఖ్యమంత్రి ఆస్కారం కల్పించలేదని, జగన్ గతం కన్నా బాగా మాట్లాడుతున్నారని కెఇ ఇటీవల చేసిన వ్యాఖ్యల వెనుక కూడా ఇదే అసంతృప్తి కారణమై ఉంటుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: