జమ్ము కాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒమర్ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్‌తో చేతులు కలపటం ద్వారా జమ్ము కాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బిజెపి తెర వెనక చర్చలు జరుపుతోంది. ఒమర్ అబ్దుల్లా గత రాత్రి ఢిల్లీలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లితో చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. బిజెపికి ముఖ్యమంత్రి పదవి, ఎన్‌సికి ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు ఒమర్ అబ్దుల్లాకు కేంద్రంలో క్యాబినెట్ మంత్రి పదవి ఇచ్చేలా చర్చలు కొనసాగుతున్నాయని అంటున్నారు. అరుణ్ జైట్లి, బిజెపి ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ గురువారం జమ్ములో పార్టీ శాసన సభ్యులతో సమావేశమై రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై విడివిడిగా చర్చలు జరిపారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని బిజెపి శాసన సభ్యులతోపాటు ఎంపిలు కూడా చెప్పినట్లు తెలిసింది. జమ్ముకాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై బి.జె.పి అధినాయకత్వం మరోవైపు నుండి పి.డి.పితో కూడా మంతనాలు జరపటంతోపాటు ఇండిపెండెంట్లతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. పిడిపి నాయకురాలు మహబూబా ముఫ్తి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బిజెపితో చేతులు కలిపే అంశంపై పార్టీ శాసన సభ్యులతో మంతనాలు జరుపుతున్నారని చెబుతున్నారు. బిజెపికి ఆరు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు మహబూబా ముఫ్తి అంగీకరించటం లేదని తెలిసింది. మొదటి మూడు సంవత్సరాలు పిడిపి అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటే ఆ తరువాత ఆఖరు మూడు సంవత్సరాలు బిజెపి అభ్యర్థి ముఖ్యమంత్రి పదవి నిర్వహించేలా ఒప్పందం చేసుకోవాలని మహబూబా ముఫ్తి షరతు విధిస్తునట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మహబూబా ముఫ్తి ప్రతిపాదనను అంగీకరించేందుకు బిజెపి అధినాయకత్వం సిద్దంగా లేదు. బిజెపి అభ్యర్థి ఆరేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉంటారని, పిడిపికి ఉపముఖ్యమంత్రి పదవితోపాటు కేంద్రంలో క్యాబినెట్ మంత్రి పదవి ఇస్తామని బిజెపి నాయకులు చెబుతున్నారు. మహబూబా ముఫ్తి బిజెపి ప్రతిపాదనపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. మహబూబా ప్రతిపాదించిన విధంగా మొదటి మూడేళ్లూ ముఖ్యమంత్రి పదవిని పిడిపికి ఇచ్చేందుకు అంగీకరిస్తే వారు ఆ తరువాత మొండిచెయ్యి చూపితే ఏం చేయగలమన్నది బిజెపి నాయకుల ప్రశ్న. మరోవైపు బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం మంచిది కాదని నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. మాజీ మంత్రి ఆగా రోహుల్లా పార్టీ అధినాయకుడు ఒమర్ అబ్దుల్లాను కలిసి బిజెపితో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం మంచిది కాదని స్పష్టం చేశారు. ఒమర్ అబ్దుల్లా బిజెపితో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పక్షంలో ఆగా రోహుల్లా మరి కొందరు శాసన సభ్యులు పార్టీకి దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇదిలా ఉంటే కొందరు ఇండిపెండెంట్లు బిజెపి నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని అంటున్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నందున రాష్ట్రంలో కూడా బిజెపి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే బాగుంటుందని జమ్ము ప్రాంతం నాయకులు చెబుతుంటే శ్రీనగర్ లోయ ప్రాంతం నాయకులు మాత్రం బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కావటం మంచిది కాదని వాదిస్తున్నారు. అందుకే వారు బి.జె.పితోకలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదని పిడిపి, ఎన్‌సి నాయకులపై వత్తిడి తెస్తున్నారు. బిజెపి నాయకులు మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖత చూపిస్తున్నారని అంటున్నారు. జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన 370 ఆర్టికల్‌ను యథాతథంగా కొనసాగించటంతోపాటు జమ్ముకాశ్మీర్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించేందుకు ఎన్‌డిఏ ప్రభుత్వం ముఖ్యంగా బిజెపి అధినాయకత్వం అంగీకరించే పక్షంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒమర్ అబ్దుల్లా సుముఖంగా ఉన్నారని అంటున్నారు. ప్రధాని మోదీ ఈ అంశంపై ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నాయకుడు అరుణ్ జైజేట్లితో చర్చలు జరిపి తన అభిప్రాయాలన్ని చెప్పినట్లు తెలిసింది. జమ్ము కాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో బిజెపి అధినాయకులు ముఖ్యంగా ప్రధాని ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ సంసిద్దతను వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: