బీమా, బొగ్గు రంగాల్లో ఏకపక్షంగా సంస్కరణలు చేపట్టిన మోడీ సర్కార్‌ ఇక ఇ-కామర్స్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెంపుపై దృష్టి కేంద్రీకరిస్తోంది. ఇప్పటికే డిపార్టుమెంట్‌ ఆఫ్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌ (డిఐపిపి) ఇ-కామర్స్‌ రంగంలో ఎఫ్‌డిఐ పరిమితిని 49 శాతానికి, రక్షణ రంగంలో 100 శాతానికి పెంచాలని ప్రతిపాదించిందని సమాచారం. ప్రస్తుతం ఇ-కామర్స్‌ రంగంలో ప్రత్యక్షంగా ఆయా కంపెనీలు వస్తువులను విక్రయించడంపై నిషేదం ఉంది. గత ఆగస్టులోనే కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలో ఎఫ్‌డిఐ పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచింది. తాజాగా ఆర్డినెన్స్‌ ద్వారా బీమా రంగంలోనూ ఈ పరిమితిని అమాంతం పెంచింది. ఎన్నికల ముందు చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను విభేదించిన బిజెపి ప్రభుత్వం ఇ-కామర్స్‌ ద్వారా ఆ పెట్టుబడిదారుల కోరికలు తీర్చనుందనే విమర్శలు పెరుగుతున్నాయి. ఇ-కామర్స్‌ రంగంలోకి ఎఫ్‌డిఐ పరిమితిని పెంచడమంటే ఈ రంగంలో విదేశీ సంస్థలు ప్రత్యక్షంగా తమ ఉత్పత్తులను భారత మార్కెట్లోకి విక్రయించుకోవడానికి ఎర్ర తివాచీ పర్చినట్లే అవుతుంది. ఇ-కామర్స్‌, రక్షణ రంగంలో ఎఫ్‌డిఐ పరిమితిని పెంచాలని డిఐపిపి కార్యదర్శి అధ్యక్షతన ఆ శాఖ ప్రతిపాదిస్తూ ఇప్పటికే అంతర్గత మంత్రుల కమిటీకి సూచించింది. దీంతో అమెరికా నుంచి పెట్టుబడులను ఆకర్షించవచ్చని ఇందులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలపై డిసెంబర్‌ 18న అంతర్గత మంత్రివర్గం భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో వివిధ రంగాల్లో ఉన్న ఎఫ్‌డిఐ పరిమితుల పెంపుపై ఒత్తిడిలు నెలకొన్నాయని సమాచారం. ఇదే క్రమంలో ఇ-కామర్స్‌ రంగంలోనూ పలు అమెరికా కంపెనీలు తమకు పెట్టుబడులు పెట్టుకునేలా ఆర్థిక చట్టాలను సవరించాలని ఇందుకు మోడీ సర్కార్‌ చర్యలు తీసుకోవాలని భారత్‌కు సూచిస్తున్నాయి. అమెరికా ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ భారత్‌లో 300 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ముందుకు వచ్చిందని డిఐపిపి పేర్కొంటుంది. మరిన్ని పెట్టుబడులకు ఈ సంస్థ ప్రభుత్వ అనుమతిని కోరుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం విదేశీ ఇ-కామర్స్‌ కంపెనీలు భారత్‌లో తమ వ్యాపారాలను నిర్వహించుకోవచ్చు. కాని ప్రత్యక్షంగా వినియోగదార్లకు విక్రయించుకోవడానికి వీలు లేదు. అమెజాన్‌, మోర్గాన్‌ స్టేన్‌లీ, బిఎఇ సిస్టమ్స్‌, ఫోర్డ్‌, ఇ-బే సంస్థల వినతులును డిఐపిపి అంతర్గత మంత్రుల కమిటీ దృష్టికి తీసుకువచ్చాయని ఓ ఆంగ్ల పత్రిక ప్రత్యక కథనం వెల్లడించింది. ప్రభుత్వ గణంకాల ప్రకారం ఇ-కామర్స్‌లో 2013-14 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో అమెరికా కంపెనీలు 806 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఆ ఏడాదిలో మొత్తం విదేశీ పెట్టుబడుల్లో ఈ రంగం వాటా 6 శాతంగా ఉంది. అమెరికా-భారత్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ వ్యాపారాన్ని 500 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే దీనికి ఎలాంటి కాలపరిమితి పెట్టుకోలేదు. చట్ట సభలతో సబంధం లేకుండా బీమా, బొగ్గు రంగాల్లో బిజెపి ప్రభుత్వం సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుతూ బుధవారం కేంద్ర కేబినెట్‌ ఆర్డినెన్స్‌ జారీకి ఆమోదం తెలిపింది. దీంతో సుమారు రూ.36,000 కోట్ల నుంచి రూ.48,000 కోట్ల విదేశీ పెట్టుబడులు వస్తాయని అంచనా వస్తోంది. వైద్య రంగంలో పరికరాల ఉత్పత్తిలో 100 ఎఫ్‌డిఐని అనుమతించింది. కేంద్ర కేబినెట్‌ సమావేశనంతరం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ సంస్కరణలకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఎవరు అడ్డుపడ్డా సంస్కరణలను ఆపేది లేదని గత వారంలోనూ ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా ఇలాంటి నిర్ణయాలు ప్రజస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు లాంటివని విపక్ష, వామపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: