వంద కోట్లకు పైగా ఎన్నికల ఖర్చు. వందలాది ఎన్నికల ర్యాలీలు.వెరసి ఇదీ కేజ్రీవాల్ న్యూ స్కెచ్. పదే పదే జనాల దగ్గరికి వెళ్తే, వాళ్లకు చేరువైనట్టేనన్నది అరవింద్ కేజ్రీవాల్ ఫార్ములా. దీని కోసమే ఈ కసరత్తంతా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమైన ఏకే గేమ్ ప్లాన్ ఏమిటో చూద్దాం. ఢిల్లీ పీఠాన్ని మళ్ళీ కైవసం చేసుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్s తెగ కుస్తీపడుతున్నారు. ఇందుకు ఆయన సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నారు. మాటల తూటాలతో పాటు దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనప్పటికీ పూర్తి స్థాయిలో ప్రచారంలో మునిగితేలుతున్నారు. డిసెంబర్, జనవరి నెలల్లో 85కు పైగా ఎన్నికల ర్యాలీలు నిర్వహించాలన్నది ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్. జనవరిలో 60 ర్యాలీలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం ఒక ర్యాలీ, మరికొన్ని చోట్ల రెండు ర్యాలీలు నిర్వహించడం తొలి ప్రాధాన్యత.  దీనితో పాటు ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక జనసభ నిర్వహించడం కోసం ఇంత విస్తృతంగా పర్యటించేందుకు వ్యూహం వేసింది ఆప్. ఇక రోడ్ షోలు ఉండనే ఉన్నాయి. అవి షరా మామూలుగా నిత్యం జరుగుతూనే ఉంటాయి. కేజ్రీవాల్-తో పాటు స్టార్ క్యాంపెయినర్లుగా కమెడియన్ కం ఎంపీ భగ్వంత్ మాన్, నటి గుల్ పనాగ్, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ, కవి కుమార్ విశ్వాస్ ఢిల్లీ వాసులను ఆకట్టుకునే ప్రయత్నం చేసేందుకు సర్వం సిద్ధమైంది. గత ఎన్నికల్లోలానే ఈసారి కూడా భారీ ఎత్తున 250కి పైగా ప్రొజెక్టర్లను ఢిల్లీ మహానగరంలో ఆప్ ప్రయోగిస్తోంది. కేజ్రీవాల్ ప్రసంగాలను, పార్టీ అజెండా, పార్టీ పాలసీతో కూడిన షార్ట్ ఫిలింను ఈ ప్రొజెక్టర్లతో ప్రతి వార్డులోనూ చూపిస్తూ ప్రచార పర్వంలో కేజ్రీవాల్ అందరికంటే ముందే దూసుకుపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: