ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది. అసలు సార్వత్రిక ఎన్నికలు అయిపోయి ఆరు నెలలు అయినా సరిగా గడిచాయో లేదో... అప్పుడే భారతీయ జనతా పార్టీ నేతలు వచ్చే ఎన్నికలపై దృష్టి సారించామని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని సొంతం చేసుకొంటామని అంటున్నారు. ఈ మేరకు తమ పార్టీ అధ్యక్షుడి చేత వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఏర్పాటు చేసుకొన్న ప్రణాళికను ప్రారభిస్తామని వారు చెబుతున్నారు. జనవరి ఏడో తేదీన భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణకు రానున్నాడట. ఇక్కడ జరిగే పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటాడట. ఈ నేపథ్యంలో బీజేపీ వాళ్లు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని సాధించుకోవడం.. అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారట! అధికారాన్ని సాధించుకోవాలనే లక్ష్యం పెట్టుకోవడం మంచిదే కానీ.. మరీ అప్పుడే వచ్చే ఎన్నికల గురించి మాట్లాడటం పొరపాటు అవుతుంది. వాటికి ఇంకాచాలా సమయం ఉంది. ఇప్పుడే వచ్చే ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకొంటే.. మరో నాలుగున్నర సంవత్సరాల పాటు ఆ ఉత్సాహాన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో బొచ్చెడు సమస్యలున్నాయి. పార్టీకి చాలాచోట్ల బేస్ లేదు. నాయకత్వ లోపం ఉంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలి. ఆ తర్వాత అధికారం గురించి ఆలోచించినా బావుంటుంది. అయితే కమలనాథులు మాత్రం అధికారం అనేస్తున్నారు. మరి ఇది ఉత్సాహమా.. అత్యుత్సాహమా!

మరింత సమాచారం తెలుసుకోండి: