ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రోశయ్య తన అల్లుడుకి హైదరాబాద్ లోని ప్రభుత్వ స్థలాన్ని ధారదత్తం చేశాడనే ఆరోపణలు ఇప్పడు హైలెట్ అవుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగి, తెలంగాణలో కాంగ్రెస్ విరోధి అయిన పార్టీ అధికారం చేపట్టడంతో పాత వ్యవహారాలను ఇప్పుడు తిరగదోడుతున్నారు. సీమాంధ్రుడు అయిన రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న వ్యవహారాలు ఇప్పడు చర్చనీయాంశాలు అవుతున్నాయి. ఎన్నో కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని రోశయ్య అల్లుడికి కేవలం కోటి రూపాయలకే కట్టబెట్టారట. కోటి రూపాయలు అనేది పెద్ద మొత్తమే అయినా.. ఆ భూమి విలువ మాత్రం చాలా ఎక్కువట. ఈ నేపథ్యంలో ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ పెద్ద ఒకరు ప్రకటన కూడా చేశారు. మరి ఇలా తమ పార్టీ తరపు నుంచి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వ్యక్తిపై ఏవైనా ఆరోపణలు వస్తే కాంగ్రెస్ వాళ్లు స్పందించాలి. రోశయ్య చాలా మంచి వాడు, అలాంటి పనులు చేయడు అనాలి.. అయితే అటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కానీ, ఇటు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కానీ ఈ విషయంలో మారు మాట్లాడటం లేదు. అసలు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచ్చినా.. కాంగ్రెస్ నేతలు స్పందించలేదు. రోశయ్య విషయంలో ఇలా సొంత పార్టీ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నా... సొంత కులం వారు మాత్రం సైలెంట్ గా ఉండటంలేదు. రోశయ్య చాలా మంచి వాడని, ఆయన మచ్చలేని మనిషి అని.. ఆయన పై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని వాసవీ సంఘాల వాళ్లు అంటున్నారు. ఆర్యవైశ్యులకు పెద్దదిక్కుగా ఉన్న ఆయనపై ఇలాంటి ఆరోపణలే తగదని వారు అంటున్నారు. మరి వీరి మాటలపై తెలంగాణ ప్రభుత్వం ఏమంటుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: