ఉత్తరాంధ్రలో ఒకప్పుడు బొత్స సత్యనారాయణ చక్రం తిప్పారు. అంతకంటే ముందు ఎర్రన్నాయుడు హవా నడిచింది. కానీ ప్రస్తుతం మాత్రం మంత్రి గంటా శ్రీనివాసరావే రింగ్ మాస్టర్. ఎవరైనా ఇతడి ఇంటికి రావాల్సిందే. మరీ ముఖ్యంగా వలసన నేపథ్యంలో సాగుతున్న చర్చల్లో భాగంగా గంటా శ్రీనివాసరావు కీలకంగా మారారు. ఉత్తరాంధ్రకు సంబంధించి ఎవరైనా టీడీపీలో చేరాలనుకుంటే గంటాను ఆశ్రయించాల్సిందే. అలా మొత్తం ఉత్తరాంధ్ర రాజకీయాలన్నీ గంటా కనుసన్నల్లో సాగుతున్నాయి. దీనికి తోడు గంటా ఈమధ్య చేసిన ఓ ప్రకటన మిగత పార్టీల్లో గుబులుపుట్టిస్తోంది. విశాఖలో మీడియాతో మాట్లాడిన గంటా చాలామంది నేతలు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, తమతో సంప్రదింపులు జరుపుతున్నారని బాంబు పేల్చారు. దీంతో ఎవరికి వాళ్లు భుజాలు తడుముకోవడం మొదలుపెట్టారు. పైకి ఎవరూ ప్రకటించకపోయినా, గంటా చెప్పింది అక్షరాలా నిజం. ఉత్తరాంధ్రకు చెందిన చాలామంది నేతలు ఇప్పుడు పచ్చకండువా వేసుకునేందుకు ఎగబడుతున్నారు. క్లీన్ మెజారిటీ సాధించడం, కేంద్రంలో పలుకుబడి ఉండడంతో సైకిల్ ఎక్కేందుకు తొందరపడుతున్నారు నేతలంతా. ఇలా ఉత్సుకత చూపిస్తున్న నేతల్లో ఎక్కువమంది వైసీపీ నుంచి ఉండడం ఆ పార్టీని కలవరబెడుతోంది. ఒక్కసారి కనుక గంటా కమిటైతే.. చంద్రబాబు గేట్లు తెరిస్తే ఉత్తారాంధ్రలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదైమైనా గంటా స్టేట్ మెంట్ వెనక మర్మం ఏంటనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: