టీమిండియాతో ఇక్కడ జరుగుతున్నమూడో టెస్టులో ఆసీస్ మరోసారి భారీ స్కోరు నమోదు చేసింది. తొలి రోజు ఇరుజట్లు సమస్థాయిలో ఆకట్టుకోగా.. రెండో రోజు మాత్రం ఆసీస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. కెప్టెన్ స్మిత్ మరోసారి సెంచరీతో ఆకట్టుకోవడంతో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 530 పరుగుల భారీ స్కోరు చేసింది. స్మిత్ (305 బంతుల్లో 15 ఫోర్లు ; రెండు సిక్సర్లు)తో 192 పరుగులు చేశాడు. తొలిసారి డబుల్ సెంచరీ చేసే అవకాశాన్నితృటిలో కోల్పోయిన స్మిత్ చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 25 టెస్టు మ్యాచ్ ల్లో 47 ఇన్నింగ్స్ ల్లో ఏడు సెంచరీలు నమోదు చేసిన స్మిత్ కు టెస్టుల్లో ఇదే అత్యధిక స్కోరు. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో అదరగొట్టిన స్మిత్.. మూడో టెస్టులోకూడా అదే జోరును కొనసాగించి టీమిండియా బౌలర్లకు పరీక్షగా నిలిచాడు. ఒకప్రక్క ఆసీస్ వికెట్లు రాలుతున్నా.. స్మిత్ మాత్రం చెదరని ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడం విశేషం. ఐదు వికెట్ల నష్టానికి 259 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో శనివారం రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ మరింత దూకుడుగా ఆడింది. .బ్రాడ్ హాడిన్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు.హాడిన్ ఆరు వికెట్టు రూపంలో 55 పరుగుల వద్ద పెవిలియన్ కు చేరగా.. మిచెల్ జాన్సన్ 28 పరుగులు చేసి అవుటయ్యాడు.ఆ తరుణంలో స్మిత్ కు జత కలిసిన ర్యాన్ హారిస్(74) పరుగులు చేసి ఆసీస్ భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీకి నాలుగు వికెట్లు, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ లకు తలో మూడు వికెట్లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: