మంత్రుల సాక్షిగా విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి? అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక అంతరార్ధం ఏమిటి? అసలు కృష్ణాజిల్లా టీడీపీలో ఏం జరుగుతోంది? ఇంతకీ నాని విమర్శించింది అధికారులనేనా లేదా వారిని సాకుగా పెట్టి ఇంకెవరి మీదన్నా విరుచుకుపడ్డారా? ఇదే ప్రస్తుతం కృష్టాజిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్-గా మారింది. అధికారిక కార్యక్రమంలో ఓ ఎంపీ ఇలా చెబితే దాని అర్థం ఏమిటి? ప్రభుత్వ పథకాన్ని ప్రారంభిస్తూనే దాని వల్ల ఉపయోగం లేదని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది అసహాయతా లేక అసమ్మతా? ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. విజయవాడ ఆటోనగర్ మురుగునీటి శుద్ధి కేంద్రం శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని అధికారులపై విరుచుకుపడ్డారు. మంత్రులు దేవినేని ఉమ, నారాయణ సమక్షంలో 8 కోట్ల రూపాయలతో నిర్మించిన ట్రీట్-మెంట్ ప్లాంట్ ఎందుకు పనికొస్తుందని ప్రశ్నించారు. మునిసిపల్ కమిషనర్ ప్రజాప్రతినిధుల్ని సంప్రదించకుండా అభివృద్ధి పనులు చేపట్టడమేంటని మండిపడ్డారు. మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి పంటకాల్వల్లో కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను కేశినేని టార్గెట్ చేయడం వెనుక అసలు కారణాలు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు నానిని తీవ్రంగా టెన్షన్ పెట్టిన నేతలే ఇప్పుడు కూడా కంట్లో నలుసుల్లా వ్యవహరిస్తున్నారనేది కేశినేని వర్గీయుల ప్రధాన ఆరోపణ. విజయవాడ పార్లమెంటు అభ్యర్ధిగా నానిని ఎన్నికలకు రెండేళ్ల ముందే చంద్రబాబు ప్రకటించినా ఎన్నికలొచ్చేసరికి మాత్రం బీఫారం విషయంలో చాలా డ్రామా నడిచింది. పదేళ్ళుగా పార్టీలో కీలకపాత్ర పోషించిన జిల్లా నాయకుడొకరు నాని అభ్యర్ధిత్వం విషయంలో అడ్డుతగిలినట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే సుజనా ఆశీస్సులు, టీడీపీలో జిల్లా ప్రముఖుల మద్దతుతో నాని అభ్యర్ధిత్వాన్నే చంద్రబాబు ఖరారు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా విభేదాలు సర్దుమణగలేదు. జడ్పీ ఛైర్-పర్సన్, విజయవాడ మేయర్ వంటి పదవుల విషయంలో జిల్లా నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఎన్నికలకు ముందే జడ్పీ ఛైర్-పర్సన్-గా గద్దె రామ్మోహన్ సతీమణి పేరును ప్రకటించడంతో ఆమెకే బాధ్యతల్ని అప్పగించాల్సి వచ్చింది. ఇక విజయవాడ మేయర్ పదవిని దక్కించుకునే విషయంలోనూ తీవ్ర పోటీ నెలకొంది. మంత్రి దేవినేని ఉమ మరొకరికి పదవిని కట్టబెట్టాలని చూసినా చివరకు నాని సూచించిన కోనేరు శ్రీధర్-కే మేయర్ పదవి దక్కింది. అయితే, మేయర్-గా కోనేరు శ్రీధర్ బాధ్యతలు చేపట్టినా మునిసిపల్ కమిషనర్, ఇతర సిబ్బంది నుంచి సహకారం మాత్రం కరువైంది. కార్పొరేషన్ చేపట్టే పనుల్లో మునిసిపల్ కమిషనర్-దే పైచేయిగా మారింది. ఇది ఎంపీ ఆగ్రహానికి కారణమైంది. ఎంపీ కార్యాలయం పక్కనే ఉన్న ఖాళీ స్థలం విషయంలో బొమ్మదేవర సుబ్బారావు అనే వ్యక్తితో ఎంపీ వర్గానికి కొద్ది నెలల క్రితం వివాదం తలెత్తింది. ఇది బయటకు పొక్కడం, వివాదం వెనుక జిల్లా టీడీపీ నేతల ప్రోత్సాహం ఉందనే అనుమానం ఎంపీ వర్గంలో ఉంది. చివరకు ఎంపీ అనుచరులపై పోలీస్ కమిషనర్ కేసులు నమోదు చేశారు. అందుకే పోలీస్ కమిషనర్ తీరుపైనా విమర్శలు గుప్పించారు నాని.  ఓ వైపు అధికారుల సహాయ నిరాకరణ, మరోవైపు పోలీసుల వ్యవహార శైలితో ఎంపీ నాని విసిగిపోయినట్లు తెలుస్తోంది. దీనికి తోడు జిల్లా కలెక్టర్, జేసీల నుంచి సహకారం అంతంత మాత్రంగానే లభిస్తోంది. తెలంగాణ క్యాడర్-కు వెళ్ళిపోయే హడావుడిలో ఉన్న జిల్లా కలెక్టర్ రఘునందనరావు, బదిలీపై వెళ్లాలని జాయింట్ కలెక్టర్-లు పనిపై పెద్దగా శ్రద్ధ వహించట్లేదని చెబుతున్నారు. ఎంపీ కార్యాలయం నుంచి ఏవైనా ఫిర్యాదులు వెళ్లినా అధికార యంత్రాంగం ఖాతరు చేయకపోవడంతో కేశినేని నాని బహిరంగంగానే తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. దేవినేని నాని ఏకపక్షంగా వెళితే కుదరదంటూ అందరి ముందే చెప్పేశారు. అయితే ఇదంతా చిన్న వ్యవహారమేనని అందరి మధ్య సహకారం అవసరమని మంత్రి నారాయణ చెబుతున్నారు. మొత్తం మీద ఎంపీ కేశినేని నాని ఆగ్రహమంతా మంత్రి దేవినేని ఉమపైనే అన్నది స్పష్టంగా అర్ధమవుతుంది. జిల్లా పార్టీలో ఉమ వర్గాల్ని పెంచి పోషిస్తున్నారని అదే ఎంపీ ఆగ్రహానికి అసలు కారణమనేది నాని ఆవేదన వెనుక ఆంతర్యం. దీనికి దేవినేని ఉమా ఏమీ స్పందిచకపోయినా ఆయన ఏం చేస్తారన్నదానిపై మాత్రం టీడీపీలో జోరుగా చర్చసాగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: