ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పెట్టకపోవడమే కాకుండా ..అసలు ఆ ఊసే ఎత్తకపోవడంతో ఎమ్మార్పీఎస్ అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు రాష్ట్రాలలో ఆందోళన చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు నిచ్చారు. ఒకప్పుడు రాష్ట్రంలో తానే పెద్దమాదిగను అని ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాని గురించే మాట్లాడడం లేదు. ఈ నేపథ్యంలో శనివారం నిజామాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో 30 మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సమావేశంపై దాడి చేసి రసభసా చేశారు. ఎమ్మార్పీఎస్ మీద టీడీపీ కార్యకర్తలు కుర్చీలతో దాడి చేశారు. ఇంతకుముందు గుంటూరు, నెల్లూరులలో టీడీపీ కార్యాలయాల మీద దాడి చేసిన ఎమ్మార్పీఎస్ ఇప్పుడు నిజామాబాద్ సమావేశాన్ని టార్గెట్ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మార్పీఎస్ ను వాడుకుని వదిలేశారని ఆ సంఘం నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. దాడి నేపథ్యంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు వాహనం అద్దాలు పలిగాయి. ఆ సమయంలో అక్కడ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణలు ఉన్నారు. వారికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. “కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయి తమ పార్టీ సమావేశం మీద దాడి చేశాయని, ఇలాంటి దాడులకు భయపడి వెనక్కి తగ్గమని, తెలంగాణలో తమ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకని ఈ దాడులు జరుగుతున్నాయని” తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు అనడం ఇక్కడ కొసమెరుపు. తెలంగాణలో టిడిపి ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం ఏమిటో!

మరింత సమాచారం తెలుసుకోండి: