ఆర్బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ప్రభుత్వ రుణ మాఫీ పధకాల ప్రయోజనాలపై సందేహాలు వెలిబుచ్చారు. వాటి వల్ల రైతులకు రుణాలు సరిగా సకాలంలో అందవని శనివారం అభిప్రాయపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో రుణమాఫీ జరుగుతోందని, అయితే దీనివల్ల రుణాలు అందటంలో అంతరాయాలు ఏర్పడతాయని, వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని పరిశీలనలో తేలిందని ఇండియన్‌ ఎకనమిక్‌ అసోసియేషన్‌ వార్షిక సమావేశంలో అన్నారు. రైతుల ఆత్మ హత్యల అంశం చాలా సున్నితమైనదని, దీనిపై పరిశోధించాల్సి ఉందని అన్నారు. వ్యవసాయరంగంలో రుణంపై ఎంత ఆలోచిస్తున్నామో ఆత్మహత్యలపై కూడా అంతకంటే ఎక్కువే పరిశీలించాలని సూచించారు. వారు ఎంత మేర బ్యాంకులకు రుణపడుతున్నారు, బ్యాంకులు ఎంతమేర వాటిని భరించగలవని ఆలోచించాలన్నారు. ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలు గత ఏడాది ఫైలిన్‌ తుపాను గురైన రైతులకు రుణమాఫీ ప్రకటించాయన్నారు. రుణాల్లో 25 శాతం మాఫీకి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా, ఏపీ ఇంతవరకు అటువంటిదేమీ చేయలేదని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో వ్యవసాయంపై బ్యాంకులకు 1.3 లక్ష కోట్లు రుణాలున్నాయని అన్నారు.  2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం వ్యవసాయ రుణమాఫీ, రుణ సహాయ పధకం కింద చిన్న, సన్నకారు రైతులకు 3.69 కోట్లు, 60 లక్షల ఇతర రైతులకు 52,516 కోట్లు రుణ మాఫీ చేసిందని తెలిపారు. చాలా సందర్భాల్లో అర్హత ఉన్న రైతులకు రుణమాఫీ అందడం లేదని, అనర్హులే లబ్ధి పొందుతున్నారని కాగ్‌ నివేదికలో వెల్లడయిందని వివరించారు. ఈ పధకాల్లో భారీ అవకతవకలు జరిగే అవకాశం ఉందని అన్నారు. వ్యవసాయం రంగంలో సబ్సిడీలు ఉపయోగపడుతున్నాయా లేదా అని పరిశీలిస్తే ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. మాఫీ వల్ల ఉపయోగం పొందుతున్నది, తక్కువ వడ్డీకి రుణం అందుతున్నది నిజమే అయినా ఈ పెట్టుబడులు అధిక అప్పులకు దారి తీస్తున్నాయా లేక అక్రమ పెట్టుబడులవుతున్నాయా అన్నది పరిశీలించాలని చెప్పారు. దీర్ఘకాలిక రుణాలపై సబ్సిడీలివ్వమని, పంట రుణాలకే సబ్సిడీలుంటాయని, అయితే వ్యవసాయ రంగంలో ఏ రకమైన కార్యకలాపాలకు సబ్సిడీ ఇవ్వాలనేది కూడా చర్చనీయాంశమేనన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: