ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్‌గ్రిడ్‌ కోసం కొత్తగా శాశ్వత ప్రాతిపదికన 529 ఉద్యోగాలను, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన 709, మొత్తం 1238 ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ ఉత్తర్వుల (జిఓఎంఎస్‌.47)ను శనివారం జారీ చేసింది. కొత్తగా చీఫ్‌ ఇంజనీర్‌-01, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌-10, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌-31, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌-104, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌/ అసిస్టెంట్‌ ఇంజనీర్‌-346, చీఫ్‌అకౌంట్స్‌ ఆఫీసర్‌-14, సూపరింటెండెంట్‌-22 తో పాటు ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన సీనియర్‌ అసిస్టెంట్స్‌-47, వర్క్‌ ఇన్‌స్పెక్టర్స్‌-662 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటర్‌గ్రిడ్‌ కోసం కొత్తగా ఉద్యోగాలతో పాటు ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశించిన మేరకు ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టినట్లు పంచాయతీరాజ్‌ శాఖమంత్రి కె.తారకరామారావు ఈ సందర్భంగా వెల్లడించారు. 2018 నాటికి తెలంగాణ ప్రజలకు రక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, ఇందుకోసం వాటర్‌గ్రిడ్‌ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి తెలిపారు. వాటర్‌గ్రిడ్‌ కార్యక్రమం అమలు సంస్థ అయిన ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖను బలోపేతం చేసేందుకు మొత్తం 529 కొత్త ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుని, వాటికి అనుమతులు పొందినట్లు ఆయన వివరించారు. వీటితోపాటు 709 మంది సీనియర్‌ అసిస్టెంట్స్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్స్‌ను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కొత్త ఉద్యోగాల భర్తీని త్వరలోనే చేపడుతామన్నారు. ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు ఆర్‌డబ్ల్యుఎస్‌ ఉద్యోగులకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ఇందులో వాహన సదుపాయం, ల్యాప్‌టాప్‌, క్షేత్రస్థాయిలో కార్యాలయాల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. తాము చేపడుతున్న ఈ చర్యలతో వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు నిర్మాణం నిర్ధిష్ట కాలంలోనే పూర్తి చేస్తామని మంత్రి తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: