ఉత్తర ప్రదేశ్‌లో కేంద్రం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల వివరాలు తెలుసుకునేందుకు యుపి ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ గడచిన 6 నెలల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీకి 66 ఉత్తరాలు రాశారు. అయితే కేంద్రం నుండి వీటిలో కొన్నింటికి సమాధానమిచ్చింది. అఖిలేష్‌ ఈ లేఖలలో బుందేల్‌ ఖండ్‌ ప్యాకేజీ, యుపిలో పవర్‌ప్లాంట్ల ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్న బొగ్గు కొరత, కేంద్రం ప్రకటించే ప్యాకేజీలో యుపికి అందే వాటా తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. అఖిలేష్‌ యాదవ్‌ ప్రధానికి ఒక్కో నెలకు సుమారు 11 ఉత్తరాల చొప్పున రాస్తూ వచ్చారు. ఈ ఉత్తరాలలో అఖిలేష్‌ తరచూ ఎన్‌డిఎ ప్రభుత్వంలో యుపికి చెందిన 73 మంది ఎంపిలు ఉన్నారన్న విషయాన్ని గుర్తుచేస్తూ వచ్చారు. అలాగే వారంతా యుపి అభివృద్ధ్దికి తమ నిధులను ఖర్చుచేయాలని, నూతన ప్రాజెక్టుల మంజూరు, ఏర్పాటు దిశగా వారు ఆలోచించాలని కోరారు. అలాగే పార్లమెంటులో వారు అనవసర విషయాలతో కాలయాపన చేస్తున్నారని, దీనివలన పార్లమెంటు విలువైన సమయం వృథా అవుతోందని వాపోయారు. తాను అభవృద్ధి అంశం గురించే ప్రశ్నిస్తున్నానని కానీ వారు తనకు ఇతర అనవసరమైన అంశాలపై వివరణలు పంపిస్తున్నారని ఆరోపించారు. ఇందుకోసమేనా యుపి నుంచి 73 మంది ఎంపిలు పార్లమెంటులో కూర్చున్నది అని ప్రశ్నించారు. అఖిలేష్‌ పిఎంకి రాసిన లేఖలలో అటవీ వనాల అభివృద్ధి, విద్యుత్‌ కల్పన, రోడ్లు, మహిళా సాధికారత, వ్యవసాయం తదితర సామాజిక అంశాలపై పిఎం నుంచి సమాధానం కోరారు. ఈ అంశాలలో యుపికి ఏ మేరకు ఆర్థికసాయం అందించనున్నారని అడిగామని అఖిలేష్‌ చెప్పారు. ఈ విషయంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ బిజెపి పాలిత రాష్ట్రాలకు తమ సహకారం మెండుగా ఉంటుందని అన్నారని, అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో లేని యుపి అభివృద్ధిని పట్టించుకోరా అని ప్రశ్నించారు. యుపి సమాజ్‌వాది పార్టీ పాలనలో ఉందని కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. ఇటీవల అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం ఢిల్లీలో ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరైన అఖిలేష్‌ యాదవ్‌ ఆ సమయంలోనూ ప్రధాని నరేంద్ర మోడీకి మరొక లేఖను అందించారు. ఈ లేఖలో అఖిలేష్‌ యాదవ్‌ బుందేల్‌ఖండ్‌లో దిగజారుతున్న పరిస్థితుల గురించి ప్రస్తావించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి, బుందేల్‌ఖండ్‌కు ప్రత్యేక ప్యాకేజీని విడుదల చేయాలని కోరుతూ దీనిపై దోబూచులాట ఎందుకని ప్రశ్నించారు. అయితే వీటిపై ఇంతవరకూ సమాధానమేదీ రాలేదని అఖిలేష్‌ వాపోయారు. అలాగే అఖిలేష్‌ ప్రధానికి రాసిన ఉత్తరంలో ఉత్తరప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన 17 కులాలను బలహీన వర్గాలకింద గుర్తించాలని కోరారు. దీనితో పాటు రాష్ర్టంలో వివిధ రకాలుగా పంటను కోల్పోయిన రైతులకు కేంద్రం ఆర్థిక సాయమందించాలని, రైతులను ఆదుకోవాలని విన్నవించారు. ఇటీవలి కాలంలో మోడీ దేశ వ్యాప్తంగా సుమారు 1090 పథకాలను మోడీ ప్రారంభించారని అన్నారు. కాగా కేంద్ర పర్యావరణశాఖ ద్వారా అనుమతులు అందనందున విద్యుత్‌, రోడ్లు తదితర విభాగాల్లో చాలా పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలేష్‌ ఆ అంశంపై ప్రధానికి మూడు ఉత్తరాల్లో వివరించారు. అలాగే కేంద్రం యుపిలోని అన్ని జిల్లాలలో హార్టీకల్చర్‌ మిషన్‌ను ప్రారంభించాలని కోరారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలవుతున్న విషయాన్ని గుర్తుచేశారు. జాతీయ రహదారులు, అంతర్గత రాహదారుల మెయింటనెన్స్‌ కోసం పిడబ్ల్యుడిశాఖ మంత్రి శివపాల్‌ యాదవ్‌కు పలుమార్లు లేఖలు రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: