అమెరికా.. అగ్రరాజ్యం. ప్రపంచానికే పెద్దన్న. ఆ దేశం ధాటికి, దాని ఆర్థిక, సైనిక శక్తకి ఏ దేశం అయినా భయపడాల్సిందే. దానికి దాసోహం అనాల్సిందే. ప్రస్తుతం అమెరికాతో తామంత తాము కెలుక్కొనే దేశం ఏదీ లేదు. చాలా బడుగు దేశాలు అమెరికా వచ్చి తమ మీద పడకపోతే చాలని అనుకొంటున్నాయి. అయితే ఉత్తర కొరియా మాత్రం దీనికి మినహాయింపులా కనిపిస్తోంది. ఏకంగా అమెరికా అధ్యక్షుడిని కోతి.. అని సంబోధిస్తోంది ఈ దేశం. ఒబామా చేష్టల గురించి ఉత్తరకొరియా తీవ్ర స్థాయిలో మండి పడింది. ఆయన అడవిలో కోతిలాగా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తింది. అమెరికాకు, ఉత్తర కొరియాకు ఇప్పుడొక వివాదం నడుస్తోంది. సోనీ పిక్చర్స్ వాళ్లు ఒక సినిమాను రూపొందించారట. దాంట్లో ఉత్తర కొరియా అధ్యక్షుడి హత్య కు కుట్ర చేసే సన్నివేశాలున్నాయట. దీంతో ఈ సినిమా విడుదల పట్ల నార్త్ కొరియా అభ్యంతరం తెలుపుతోంది. ఈ సినిమా విడుదల అయితే సోనీ సంస్థ వెబ్ సైట్ ను హ్యాక్ చేస్తామని.. దాని వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తామని ఉత్తరకొరియా హ్యాకర్లు హెచ్చరిస్తున్నారు. దీంతో సోనీ సంస్థ వెనక్కు తగ్గింది. అయితే అక్కడక్కడ మాత్రం ఈ సినిమా విడుదల అయ్యిందట. దీనికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సహకారం ఉందని నార్త్ కొరియా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాపై కొరియన్ ప్రభుత్వం విరుచుకుపడుతోంది. అమెరికా అధ్యక్షుడు కోతిలా వ్యవహరిస్తున్నాడని.. తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని.. అమెరికా ఇందుకు పర్యవసనాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని నార్త్ కొరియా వ్యాఖ్యానిస్తోంది. మరి అమెరికా ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: