రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు మరో నాలుగున్నర సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ, కొత్త ఏడాదిలో రాజకీయంగా పెనుమార్పులు సంభవించే అవకాశం కనపడుతోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో నిశ్శబ్దం, స్తబ్దత, నైరాశ్యం ఆవరించి ఉంది. అభివృద్ధిపై ప్రకటనలు, సమీక్షలకు చంద్రబాబు పరిమితమైతే, ఆ పార్టీ అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు ప్రతిపక్ష వైకాపాలో ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నా, సరైన మార్గనిర్దేశనం లేక నాయకులు, కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నారు. అధికార తెదేపా, ప్రతిపక్ష వైకాపాల్లో నెలకొన్న నిర్లిప్తత, కొత్త సంవత్సరంలో రాజకీయ శక్తుల పునరేకీకరణకు దారితీసే అవకాశాలున్నాయి. ఈ పునరేకీకరణకు బిజెపి వేదికకానుందా? ఇదే చర్చ కాంగ్రెస్, వైకాపా, తెదేపాలో విశేషంగా జరుగుతోంది. కాంగ్రెస్‌పార్టీ పునాదులతోసహా కొట్టుకుపోవడంతో, ఆ శూన్యతను భర్తీ చేసి రాజకీయంగా జోష్ నింపేందుకు బిజెపి పావులు కదుపుతోంది. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయినా, ఆ పార్టీకి చెందిన బలమైన నేతలు బిజెపివైపు చూస్తున్నారు. విచిత్రమేమిటంటే, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న వైకాపాలో కూడా చాలామంది నేతలు బిజెపిలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. త్వరలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానున్న నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు బిజెపి తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉంది. శాసనసభలో ఒక్కసీటుకూడా లేని కాంగ్రెస్‌లో చాలామంది నేతలున్నారు. వారికి అధికారం కావాలి. వైకాపాలో చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలున్నారు. వారి రాజకీయ వ్యాపకం లేదు. అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేంతటి వైఎస్ తరహా నాయకత్వం లోపించిందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మూసపద్ధతిలో అధికారులతో సమీక్షలు, ప్రకటనలు, పెట్టుబడులు, రాయితీలు, బహిరంగ సభలతో కాలక్షేపం చేస్తున్నారు. 2004లో అధికారం కోల్పోయే ముందు చంద్రబాబు వ్యవహారశైలి మళ్లీ ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాక పునరావృతమవుతోంది. బిజెపి రాష్ట్రంలో నిలదొక్కుకునేందుకు కసరత్తును ప్రారంభించింది. ఈ చర్యలు చంద్రబాబును ఇరుకునపెడుతున్నాయి. కేంద్రం అండ ఉంటే తప్ప అస్తవ్యస్ధమైన కొత్త ఆంధ్రప్రదేశ్‌ను గాడినపెట్టలేమనే నిర్ణయంతో చంద్రబాబు వౌనంగా ఉన్నారు. బిజెపిలో ఉన్న పురంధ్రీశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణలాంటి గట్టి నేతలు చేతులు ముడుచుకుని ఎంతోకాలం కూర్చోరు. కాంగ్రెస్‌కు భవిష్యత్తులేకపోవడంతో వీరి బాటలోనే బిజెపిలోకి వెళ్లాలని పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నారు. కాని తెదేపాతో బిజెపి తెగతెంపులుచేసుకుంటే తప్ప, చంద్రబాబు నీడన తాము బతకలేమని వీరు కరాఖండిగా చెప్పారు. అదే సమయంలో బిజెపికి కేంద్రంలో తెదేపా మద్దతు అవసరం లేదు.  పైగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా ఒక కొత్త ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందనే యోచనతో బిజెపి ఉంది. ఏదో వంకన వచ్చే ఏడాదిలో తెదేపా నీడ నుంచి బయటపడి బయటకు వచ్చి నిలదొక్కుకునే ప్రయత్నం చేయాలనే ఆలోచన బిజెపి నేతలకు ఉంది. సరైన సమయం కోసం అటు కాంగ్రెస్, ఇటు బిజెపి నేతలు వేచి చూస్తున్నారు. తాజాగా వైకాపాకు చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి బిజెపి వైపు మొగ్గుచూపే అవకాశాలు కనపడుతున్నాయి. ఆయన బాహాటంగానే జగన్ వైఖరిపట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. అదే బాటలోనే మరి కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలు బిజెపిలో చేరవచ్చు. చిత్తూరు, నెల్లూరు, విజయనగరం, కడపకు చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రులు కూడా బిజెపిలో చేరేందుకు ఆసక్తితో ఉన్నారు. వైకాపాకు చెందిన కొణతల రామకృష్ణ తెదేపాలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వైకాపాకు చెందిన అనేక మంది నేతలకు తెదేపా గాలం వేస్తోంది. వైకాపా, కాంగ్రెస్‌లో ఒక సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బిజెపివైపు మొగ్గు చూపుతుండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: