రాష్ట్రం విడిపోయి ఏడు నెలలు దాటుతోంది. అయినా.. ఇంకా కొన్ని విషయాల్లో విభజన ప్రక్రియ ఇంకా అసంపూర్తిగానే ఉంది. ఆర్టీసీ తర్వాత అలా విభజన కష్టాలు ఎదుర్కొంటున్న మరో సంస్థ ఆరోగ్యశ్రీ ట్రస్టు. జిల్లాల సిబ్బంది వరకూ విభజన పూర్తయినా కేంద్ర కార్యాలయంలో విభజన మాత్రం అలాగే ఉంది. ఐఏఎస్ అధికారుల విభజన అలా పూర్తయిందో లేదో.. అప్పుడే రెండు తెలుగు రాష్టాలు దీనిపై కన్నేశాయి. రెండు రాష్ట్రాలూ సీఈవో పోస్టు కోసం ఐఏఎస్ అధికారులను నియమించేశాయి. అంటే ఉన్న ఒక్క పోస్టు కోసం ఇద్దరు ఐఏ ఎస్ లను నియమించాయన్నమాట.  ఇప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఎవరు అసలు సీఈవో.. ఎవరి ఆజ్ఞలు చెల్లుతాయి.. సిబ్బంది ఎవరి మాట వినాలి.. వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత.. ఆరోగ్య శ్రీ పథకం పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలూ ఉమ్మడిగా నిర్వహించుకోవాలని పునర్విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అప్పటికే ఉమ్మడి ప్రభుత్వం నియమించిన ధనుంజయ రెడ్డి ఆరోగ్య శ్రీ ట్రస్టుకు సీఈఓ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పడు ధనుంజయరెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. లేటెస్టుగా ఐఏఎస్ ల బదిలీల్లో ధనుంజయ రెడ్డి స్థానంలో లవ్ అగర్వాల్ ను సీఈఓ గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఏపీ ఉత్తర్వులు జారీ చేసింది.  ఐఏఎస్ ల విభజనతో మేలుకొన్ని తెలంగాణ కూడా ఇప్పుడు జ్యోతి బుద్ధ ప్రకాష్ కు ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈఓ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు మంగళవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటు లవ్ అగర్వాల్.. ఇటు జ్యోతి బుద్ధ ప్రకాశ్.. ఈ ఇద్దరిలో సీఈవో సీటులో ఎవరు కూర్చోవాలి.. ఒకే సీటు కోసం తగవు పడతారా.. లేక.. ఇద్దరూ ఆఫీసును విభజించుకుని రెండు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటారా.. అన్నది రాబోయే వారం రోజుల్లో తేలిపోతుంది. అప్పటివరకూ సస్పెన్స్ తప్పదు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: