తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా.. మీడియా రంగం మాత్రం బాగా విస్తృతమైంది. ప్రత్యేకించి ఎలక్ట్రానికి మీడియా మరే భాషలోనూ లేనంతగా విస్తరించింది. చిన్నా పెద్దా కలిపి దాదాపు 20 వరకూ శాటిలైట్ ఛానళ్లు ఏపీలో ఉన్నాయంటే మామూలు విషయం కాదు. పేరుకు ఇన్ని ఛానళ్లున్నా.. మూడో, నాలుగో తప్ప.. అన్నీ ఏదో ఒక పార్టీకి కొమ్ముకాసేవే. నిష్పాక్షికమైన వార్తల కోసం, విశ్లేషణల కోసం ప్రేక్షకులు మొహం వాచేలా ఎదురు చూడక తప్పడం లేదు.  అధికార తెలుగుదేశానికి ఆది నుంచి ప్రధాన పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలతో పాటు ఆ యాజమాన్యాల ఆధిపత్యంలోని ఛానాళ్లు అండగా నిలుస్తున్నాయన్న సంగతి జగమెరిగిన సత్యమే. ఇక మరో ప్రధాన పత్రిక, ఛానెల్ అయిన సాక్షి మొదట కాంగ్రెస్ అనుకూల మీడియాగా ఉన్నా.. జగన్ సొంత కుంపటి పెట్టుకోవడంతో ఆయన బాకాగా మారిపోయాయి. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన.. తన ప్రచారం కోసం ఐ ఛానల్ ను నడిపించారు. టీఆర్ ఎస్ కూడా టీ న్యూస్, నమస్తే తెలంగాణ పత్రిక నడుపుతోంది.  చివరకు వామపక్షాలు కూడా సొంత ఛానళ్లు పెట్టుకున్నాయి. 10టీవీ సీపీఎం ది కాగా.. టీవీ 99 సీపీఐది. అందుకే ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ నేతలు తమకూ ఓ ఛానల్ , పత్రిక ఉండాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం తేవాలంటే మీడియా అండ ఉండాల్సిందేనని చెబుతున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్‌ కు ఆమాటే గట్టిగా చెప్పారట. మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో.. ప్రసార మాధ్యమాల ద్వారా పార్టీకి ఆశించిన ప్రచారం జరగడం లేదని, కాంగ్రెస్‌కు సొంతంగా టీవీ, పత్రికలు కావాలని కోరారట. మరి దిగ్విజయ్ ఏమంటారో..

మరింత సమాచారం తెలుసుకోండి: