టీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు ఎందుకు ఫైర్ కావడం లేదని ప్రశ్నిస్తున్నాడు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. టీఆర్ఎస్ విషయంలో ఎలాంటి మొహమాటాలూ వద్దని.. కేసీఆర్ పై విరుచుకుపడాలని ఈయన సూచించాడు. మరి డిగ్గీసాబ్ ఇంతటితో ఆగలేదు. టీఆర్ఎస్ విధానాలపై స్వయంగా దుమ్మెత్తిపోశాడు. టీఆర్ఎస్ ది కుటుంబ పాలన అని విరుచుకుపడ్డాడు. నిజమే.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు.. ఆయన తనయుడు ఒక మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూస్తున్నాడు.. మేనల్లుడు మరో శాఖను నిర్వహిస్తున్నాడు. కేసీఆర్ కూతురు ఎంపీగా ఉంది. వీళ్లందరూ తెలంగాణలో ప్రముఖ నేతలుగా చెలామణి అవుతున్నారు. అంతా వీరి కను సన్నల్లోనే నడుస్తున్నట్టుగా ఉంది. దిగ్విజయ్ సింగ్ చెప్పినది నిజమే. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇది కేసీఆర్ కుటుంబ పాలనే. అయితే కాంగ్రెస్ అంటే ఏమిటి? అది గాంధీ కుటుంబ పార్టీ కాదా? ఆ పార్టీపై హోల్ అండ్ సోలో రైట్స్ ప్రస్తుతం సోనియాగాంధీ చేతిలో లేవా? గత పదేళ్లలో సోనియాగాంధీ అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి సూపర్ బాస్ వ్యవహరించలేదా? ఇప్పడు ఏమైనా కాంగ్రెస్ లోఏమైనా మార్పు వచ్చిందా? సార్వత్రిక ఎన్నికల్లో చిత్తు చిత్తు గా ఓడిన కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ కనుసన్నల్లోనే నడుస్తోంది కదా. రేపటి రోజున పార్టీ పగ్గాలను రాహుల్ గాంధీకి అప్పజెప్పి పార్టీని గాంధీల కుటుంబ సభ్యుల చేతిలోనే పెట్టడానికి కాంగ్రెస్ వాదులంతా కట్టుబడి ఉన్నారు కదా! మరి ఇలాంటి కాంగ్రెస్ వాదుల్లో ఒకరు అయిన దిగ్విజయ్ కేసీఆర్ పాలనను కుటుంబ పాలన అనడం విడ్డూరమే. తెలంగాణ లో ఉన్నది కేసీఆర్ కుటుంబ పాలనే అయినా అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడటానికి కాంగ్రెస్ వాళ్లకు అర్హతే లేదు కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: