రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదు నుంచి పదేళ్లు ఇవ్వలేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే పదవి నుండి తప్పుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును డిమాండు చేశారు. నగరంలోని రామకోటయ్యభవన్‌లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) రాష్ట్ర సదస్సు బుధవారం రెండో రోజు ముగింపు కార్యక్రమానికి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్లమెంటులో విభజన బిల్లుపై జరిగిన చర్చలో రాష్ట్రం తరఫున అన్నీ తానే మాట్లాడి నట్లు వెంకయ్యనాయుడు ప్రచారం చేసుకున్నా రన్నారు. తన వల్లే రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా వచ్చిందని ఆయన విశాఖపట్టణం నుంచి తిరుపతి వరకు పుస్తకాలు ముద్రించి ప్రచారం చేసుకుని సన్మానాలు కూడా చేసుకున్నారని తెలిపారు. అప్పుడు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాబోయేది బీజేపీ ప్రభుత్వమని, నరేంద్రమోడీ తనకు సన్నిహితుడని ఆయన ప్రధానమంత్రి కాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదేళ్లు కల్పిస్తామని ఆయన చెప్పారని గుర్తుచేశారు. కాని ప్రస్తుతం అదే వెంకయ్యనాయుడు కేంద్రంలో మంత్రిపదవితో పాటు కీలక స్థానంలో ఉన్నారన్నారు. ప్రత్యేక హోదాపై ఆయన ప్రస్తుతం నోరు మెదపడం లేదని, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వెంకయ్య నాయుడు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పి మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండు చేశారు. ప్రత్యేక హోదా వచ్చేంతవరకు తాము పోరాడుతామ న్నారు.  రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని ప్రస్తుతం వాటిని పట్టించు కునేవారే కరువయ్యారన్నారు. రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తూ అనేక హామీలు ఇచ్చారని, పన్నులు ఉండవని, 13 రకాల విద్యాసంస్థలను ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పుతామని, పోలవరాన్ని జాతీయప్రాజెక్టుగా చేసి 90 శాతం నిధులు కేంద్రం నుంచి సమకూర్చి నిర్మిస్తామని, పర్యావరణ, అటవీఅనుమతులు ఇప్పిస్తామని చెప్పారన్నారు. కానీ వాటి ఊసే లేదన్నారు. సింగపూర్‌, జపాన్‌ తదితర దేశాలను ఆహ్వానిస్తూ అన్నీ తామే సమకూరుస్తామని సీఎం చంద్రబాబునాయుడు, పీఎం మోడీ హామీలు ఇస్తున్నారన్నారు. విదేశీ పర్యటనలు చేస్తూ వారు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలో అత్యంత సంపన్న దేశమైన అమెరికా పరిపాలన మొత్తం వైట్‌హౌస్‌ నుంచి జరుగుతున్నదన్నారు. వైట్‌హౌస్‌ కేవలం 18 ఎకరాల్లో ఉందని తెలిపారు. కాని మన రాష్ట్ర రాజధానికి వేలాది ఎకరాలు కావాలని చంద్రబాబు నాయుడు చెబుతున్నా రని ఈ భూమంతా ఎందుకని ప్రశ్నించారు. చట్టం ప్రకారం భూములు కావాల్సివస్తే మొదట ప్రభుత్వ బంజరు భూములు తరువాత పంటలు పండించని భూములను తీసుకోవాలని అవి కూడా సరిపోకపోతే ఒక పంట పండే భూములు తరువాత రెండు పంటలు పండే భూములు తీసుకోవాలన్నారు. కాని అలా కాకుండా సీఎం చంద్రబాబునాయుడు రివర్స్‌లో వస్తున్నారని మొదట రెండు పంటలు పండే భూములు తరువాత ఒక పంటపండే భూములు ఇలా రైతుల నుంచి లాక్కుంటున్నారని విమర్శించారు. విదేశాల నుంచి కాంట్రాక్టర్లను ఆహ్వానిస్తున్నారని కాని మన రాష్ట్రం వాళ్లే ఇతర దేశాల్లో కాంట్రాక్టు పనులు చేస్తున్నారన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఎంతోమంది విమానశ్రయాలతో పాటు విదేశాల్లో నిర్మాణాలు చేపడుతున్నారని గుర్తుచేశారు. ఏఐఎస్‌ఎఫ్‌ మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విద్యారంగం ప్రైవేటీకరణ అయిపోతున్నదని, విద్యారంగాన్ని కాపాడుకునేం దుకు ఏఐఎస్‌ఎఫ్‌ అగ్రభాగాన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు సయ్యద్‌ వలివుల్లా ఖాద్రీ, రాష్ట్ర అధ్యక్షుడు కరిముల్లా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బయ్యన్న, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీతం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: