తెలుగుదేశంపార్టీ పగ్గాలు అతి త్వరలో మూడో తరం ప్రతినిధి అయిన నారా లోకేష్‌ చేతిలోకి వెళ్ళనున్నాయా? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినబడు తున్నది. పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఈ విషయమై చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. 2019 ఎన్నికల వరకూ అవసరం లేకుండానే ఈలోగానే వీలుంటే మరో రెండు మూడు మాసాల్లోనే పార్టీ పగ్గాలు లోకేష్‌ చేతికి అందించేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టే పార్టీలో ప్రతీ ఒక్కరినీ మానసికంగా సిద్దం చేస్తున్నారు. ప్రతీ శనివారం ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు జరుపుతున్న పార్టీ సమావే శాలు కూడా వ్యూహాత్మకమే. ఒక్కసారిగా పార్టీ పగ్గాలు గనుక లోకేష్‌కు అప్పగిస్తే పార్టీలో ఏ మూలనుండైనా అసంతృప్తులు బయటకు వచ్చే అవకాశం ఉందన్న ఆలోచనతోనే చంద్రబాబు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అన్నీ సక్రమంగా జరిగితే, ఫిబ్రవరిలో గాని లేదంటే మహానాడు సమయానికి గాని లోకేష్‌కు పగ్గాలు అప్పగించే విషయాన్ని చంద్రబాబే అధికారికంగా ప్రకటించేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయపార్టీ అయిన టిడిపిని జాతీయపార్టీగా విస్తరించాలన్న ఆలోచనకు కూడా ఇదే మూలమని సమాచారం. వచ్చే మహానాడు సమయానికి పార్టీ జాతీయపార్టీగా విస్తరించగానే సహజంగానే జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబునాయడే వుంటారు. అపుడు ఇటు ఆంధ్రప్రదేశ్‌, అటు తెలంగాణా రాష్ట్రాల పార్టీ అధ్యక్షులెవరు అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఇందుకు సమాధానంగానే లోకేష్‌ను రెండు రాష్ట్రాల్లోని పార్టీలకు సమన్వయకర్తగా గాని లేదా ఏపి పార్టీ అధ్యక్షునిగా గాని నియమించే అవకాశాలున్నాయి. లోకేష్‌ నియామకం సజావుగా సాగేందుకు వీలుగా పార్టీలోని సీనియర్‌ నేతలను, మంత్రులను పార్టీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తున్నది. పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి లోకేష్‌ తెరవెనుక నుండి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. అందరు మంత్రుల వద్దా పార్టీలో తనకు నమ్మకస్తులైన కొందరిని ప్రజా సంబంధాల అధికారుల(పిఆర్‌ఒ) హోదాలో నియమించేందుకు లోకేష్‌ ప్రయత్నించారని బాగా ప్రచారంలో ఉంది. అయితే, కొందరు మంత్రులు అంగీకరించకపోవటంతో ఆ ప్రయత్నాలు పూర్తిగా సాగలేదని కూడా పార్టీ వర్గాలే చెబుతున్నాయి కాబట్టి ప్రభుత్వ వ్యవహరాల్లో లోకేష్‌ జోక్యాన్ని సహించలేని మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. వీరి విషయంలోనే చంద్రబాబు ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు కనబడుతున్నది. లోకేష్‌ ఆధిపత్యాన్ని ఎవరు కూడా ప్రశ్నించేందుకు వీలు లేకుండా ముందస్తుగానే ప్రతి శనివారం ప్రజాప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి మొదలైంది. ఈ సమావేశాల్లో పార్టీకి చెందిన శాసనసభ్యులు, పార్లమెంట్‌ సభ్యులతో పాటు మంత్రులు, సీనియర్‌ నేతలు పలువురు పాల్గొంటున్నారు. ఇంతమంది నేతలు ముఖ్యమంత్రితో సమావేశమైన సందర్భంలో లోకేష్‌ చంద్రబాబు పక్కనే కూర్చుంటున్నారు. పార్టీ నేతలు, మంత్రులు, ఎంఎల్‌ఏ, ఎంపి తదితరులతో చంద్రబాబు తరపున లోకేష్‌ బాబే సూచనలు చేయటం, సలహాలు ఇవ్వటంతో పాటు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. పేరుకే మాత్రమే ముఖ్యమంత్రితో ముఖాముఖి. సమావేశాలు మొత్తం లోకేష్‌ కనుసన్నల్లోనే నడుస్తున్నాయని ఒక ఎంఎల్‌ఏ వ్యాఖ్యానించారు. తెరవెనుక నుండి వ్యవహారాలు నడుపటం కన్నా ఏదో ఒక హోదాలో ప్రత్యక్ష రాజకీయాలు చేయటమే మంచిదని కూడా సదరు సీనియర్‌ నేత అన్నారు. చంద్రబాబు దావోస్‌లో ఉండగా లోకేష్‌బాబు పార్టీ కార్యాలయంలో మంత్రులు, ఎంఎల్‌ఏలు, సీనియర్‌ నేతలతో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించటమే ఇందుకు ఉదాహరణ. ఏదో హోదా లేని లోకేష్‌ సమీక్షా సమావేశం నిర్వహిస్తే సదరు సమావేశానికి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, కింజారపు అచ్చెన్నాయడు, కొల్లు రవీంద్రతో పాటు పలువురు ఎంఎల్‌ఏలు, పాలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్‌ తదితరులు హాజరవటం గమనార్హం. సంబంధిత శాఖల ఉన్నతాధికారులను కూడా సమావేశానికి రావాల్సిందిగా మంత్రులు ఆదేశాలు జారీ చేసినా, సమీక్షాసమావేశం సచివాలయంలో కాకుండా పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న కారణంగా తాము హాజరవ్వలేమని ఉన్నతాధికారులు సమాధానం ఇచ్చినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: