రోగుల కష్టాలు డాక్టరుకే తెలుస్తాయి.. అందుకే కేసీఆర్ ఎంచుకుని మరీ.. వైద్య ఆరోగ్యశాఖను ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు అప్పగించారు. కానీ ఆచరణలోకి వచ్చేసరకి రాజయ్య పనితీరుపై కేసీఆర్ అంత సంతృప్తికరంగా లేనట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఈయన శాఖలో చోటుచేసుకుంటున్న అవినీతి బాగోతాలు.. చివరకు ఆయన పదవికే ఎసరు తెచ్చేలా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల ముందు వరకూ కాంగ్రెస్ నేతగా ఉన్న రాజయ్య.. ఎన్నికల ముందు గులాబీ కండువా కప్పుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. దళితునికి ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్న హామీని తుంగలో తొక్కిన పాపం కాస్తయినా తగ్గించుకుందామనుకున్న కేసీఆర్ ఆలోచనతో రాజయ్య నక్కను తొక్కినట్టైంది. అనూహ్యంగా ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవి పొందిన రాజయ్య అంతే అనూహ్యంగా పదవి పోగొట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.  కేసీఆర్ పాలనపై ఎన్ని విమర్సలు వచ్చినా.. అవినీతి ఆరోపణలు మాత్రం పెద్దగా రాలేదు. అలాంటిది.. ఒక్క రాజయ్య చూస్తున్న శాఖలపైనే అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే.. వైద్య ఆరోగ్యశాఖలోని కాంట్రాక్టు వైద్యుల నియామకాల్లో పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్త్ యూనివర్సిటీకి తొలి రిజిష్ట్రార్‌ నియామకం విషయంలోనూ రాజయ్య అంత శ్రద్దపెట్టలేదని విమర్శలు ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ పోస్టుకు వివాదాస్పద అధికారిని నియమించడంపైనా కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారట.  ఇన్ని విషయాలపై ఇప్పటికే రాజయ్య తీరుపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్న వేళ.. మూలిగే నక్కపై తాడిపండులా.. స్వైన్ ఫ్లూ విరుచుకుపడటం కూడా రాజయ్యను బాగా ఇబ్బందిపడుతోంది. వ్యాధి ఆరంభంలోనే పత్రికలు, విపక్షాలు హెచ్చరించినా రాజయ్య అంత సీరియస్ గా తీసుకోలేదు. సరికదా.. స్వైన్ ఫ్లూ ఎక్కడుందంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. చివరకు వ్యవహారం ముదిరాక.. స్వయంగా సీఎం రంగంలోకి దిగాల్సి వచ్చింది. మొత్తం మీద.. అవినీతి ఆరోపణలు, ఉదాసీన వైఖరి.. అన్నీ కలగలిపి.. తెలంగాణ క్యాబినెట్లో తొలి వికెట్ పడిపోవడానికి కారణం కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పీకడం కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ.. పీకేయడం మాత్రం పక్కా.. అంటూ గోపాల గోపాల డైలాగ్ పేరడీని గుర్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: