అధికార పక్షమంటే.. ఏదోలా బండి లాక్కొస్తుంది కానీ.. ప్రతిపక్షానికి పోరాటమే శరణ్యం.. ఏదోలా ప్రజల దృష్టిలో ఉండకపోతే.. పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అందుకే వైసీపీ నేత జగన్ మరోసారి దీక్షకు దిగబోతున్నారు. ఆ మధ్య రుణమాఫీ అంశంపై విశాఖలో దీక్ష చేసిన జగన్ ఈసారి పశ్చిమగోదావరి జిల్లాలో దీక్ష చేయబోతున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసనగా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేసి రైతులు, డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31, ఫిబ్రవరి ఒకటి తేదీల్లో తణుకులో జగన్‌ దీక్షకు దిగబోతున్నారు.

జగన్ దీక్ష విషయం ఎప్పుడో వెల్లడైనా..ఇప్పడు ఆయనకు మద్దతుగా మరో వైసీపీ నేత దీక్షకు దిగడం ఆసక్తికరంగా మారింది. ఉరవకొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి.. తాను 25 గంటల పాటు దీక్ష చేపట్టబోతున్నానని ప్రకటించారు. అనంతపురం జిల్లాలోని హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేయాలన్న డిమాండ్ ఈ దీక్ష చేస్తానని చెబుతున్నారు. ఐతే.. జగన్ దీక్ష కంటే రెండు రోజుల ముందుగానే ఈయన దీక్ష చేస్తుండటం విశేషం. ఈ నెల 28న మధ్యాహ్నం రెండు గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం మూడు వరకు దీక్ష చేపడతానని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.

వైసీపీ కాస్త బలంగా ఉన్న జిల్లాల్లో అనంతపురం జిల్లా ఒకటి. అందుకే ఇక్కడ పార్టీని బలోపేతం చేసేందుకే ఉరవకొండ ఎమ్మెల్యేతో దీక్ష చేయిస్తున్నారన్న వాదన కూడా వినిపిస్త్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హంద్రీ-నీవాకు నాలుగున్నర వేల కోట్లు వెచ్చించి పనులు చేయించారంటున్న ఈయన.. టీడీపీ నేతలు దీన్ని పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. జిల్లా ప్రజలు.. టీడీపీకి 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను ఇచ్చినా... అనంతపురం రైతుల గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని మండిపడుతున్నారు. విశ్వేశ్వరరెడ్డి దారిలోనే మిగిలిన వైసీపీ నేతలు కూడా ప్రజాసమస్యలపై పోరాడితే ఫలితాలు బావుంటున్నాయంటున్నారు విశ్లేషకులు..

.

మరింత సమాచారం తెలుసుకోండి: