కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అత్యంత కీలకమైన రాష్ట్రం అని అంటున్నాడు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. కాంగ్రెస్ పార్టీ ఏపీ విభాగపు ఇన్ చార్జి అయిన దిగ్విజయ్ ఇప్పుడు ఆ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇలా వ్యాఖ్యానించాడు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ జీరోగా నిలబడటం దురదృష్టకరం అని.. ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం దక్కకపోవడం దారుణమని దిగ్విజయ్ ఇప్పుడు తెగబాధపడిపోతున్నాడు. అయితే ఇక్కడ వచ్చే సందేహం ఏమిటంటే.. దిగ్విజయ్ కు ఏపీ విలువ ఇప్పుడే తెలిసిందా?! సీమాంధ్ర నుంచి సమైక్య నినాదం వినిపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ కు ఏపీ విలువ తెలియలేదా?! సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తే.. వారు తమ పార్టీని సమాధి చేస్తారని ఈయన కు తెలియదా?! సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలు తమ పదవుల కోసం... అధిష్టానం ప్రాపకం కోసం వ్యవహరించగా.. ఈ కాంగ్రెస్ జాతీయ నేతలు తమ కన్నా తోపులు లేరన్నట్టుగా వ్యవహరించారు. రాష్ట్ర విభజనకు కారణమయ్యారు.అందుకు ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఈ చేదు అనుభవంలో కాంగ్రెస్ నేతలకు ఆంధ్రప్రదేశ్ విలువ తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఎంత వగచినా ప్రయోజనం లేదేమో! ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ పార్టీ సమాధి అయ్యింది. భవిష్యత్తులో ఇక్కడ ఏపీ కోలుకొంటుందన్న నమ్మకం కూడా ఎవరికీ లేదు. ఇలాంటి సమయంలో దిగ్విజయ్ లాంటి వారు వచ్చి ఏదో చేయడానికి ప్రయత్నించినా పెద్దగా ఉపయోగం ఉండదనే అనుకోవాలి. ఎలాగూ ఏపీలో కాంగ్రెస్ కు వైకాపా ప్రత్యామ్నాయంగా తయారైంది కాబట్టి.. ఇక కాంగ్రెస్ మళ్లీ కోలుకోవడం కలేనేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: