భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో దాదాపు పది, పదిహేనేళ్ల నుంచి ప్రతిపక్షంలోనే కూర్చొంది. అక్కడ కాంగ్రెస్ రాజ్యంపై పోరాడుతూనే ఉంది. అయితే ఇన్నేళ్ల పాటు పోరాడినా ఆ పార్టీ ఒక్క ముఖ్యమంత్రి అభ్యర్థిని తయారు చేసుకోలేకపోయిందా?! ఉన్నఫలంగా కిరణ్ బేడీకి పార్టీ సభ్యత్వం ఇచ్చేసి.. ఆమెను ముఖ్యమంత్రిగా ప్రకటించుకోవాల్సిన అవసరం ఏర్పడిందా?! ఇంతకీ ఢిల్లీ ఎన్నికల ప్రచార సభల్లో మోడీ పేరు మార్మోగడం లేదెందుకని? ఇప్పుడు అక్కడ కిరణ్ బేడీనే కమలదళానికి పెద్ద దిక్కు అయ్యిందేంటి?! ఈ పరిణామాలన్నీ భారతీయ జనతా పార్టీ వైఫల్యాలేనా? ఒకరకంగా చెప్పాలంటే ఇప్పటికే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నైతికంగా ఓటమి పాలైందా ? రేపటి ఎన్నికల్లో సంచలన ఫలితాలు వచ్చి ఇక్కడ మళ్లీ ఆమ్ ఆద్మీపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదా?! అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయిప్పుడు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను అరువు తెచ్చుకొంటోంది. చాలా నియోజకవర్గాల్లో ఇన్ని రోజులూ ఆమ్ ఆద్మీపార్టీ తరపున పనిచేసిన నేతలకు బీ ఫారాలు ఇచ్చి బీజేపీ తన తరపున పోటీ చేయించుకొంది. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కూడా ఇన్ని రోజులూ కేజ్రీవాల్ కంపెనీలో కనిపించిన వ్యక్తే. ఇలా ఏ విధంగా చూసుకొన్నా.. బీజేపీ ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వాసనలు కొడుతోంది. మరి సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయినప్పటి నుంచి బీజేపీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఎదుర్కొన్నా మోడీ మానియా మీదనే ఆధారపడింది. అయితే ఇప్పుడు మోడీ పేరు ఢిల్లీలో పెద్దగా వినపడం లేదు. ఇక్కడ కమలం పార్టీ పూర్తిగా కిరణ్ బేడీ ఇమేజ్ మీదనే ఆధారపడింది. మొత్తానికి ఇది కొత్తరకం రాజకీయమే.. ఈ రాజకీయంలో కమలం పార్టీ గెలిస్తే పర్వాలేదు. ఓడితే మాత్రం బీజేపీకి దేశ ప్రజలు తొలి షాక్ ఇచ్చినట్టే!

మరింత సమాచారం తెలుసుకోండి: