త్వరలోనే తాను తెలంగాణలో పర్యటిస్తానంటూ చంద్రబాబు చేసన ప్రకటన తెలంగాణలో రాజకీయ ప్రకంపనలకు కారణమవుతోంది. ఏపీ సీఎంగా ఉండి.. తెలంగాణ ప్రయోజనాలను అడుగడుగునా అడ్డుకుంటున్న చంద్రబాబును తెలంగాణలో పర్యటించనీయబోమని టీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఐతే.. తెలుగుదేశం పార్టీ తెలంగాణలోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నందున.. ఆ పార్టీ అధ్యక్షుడుగా చంద్రబాబు పర్యటనను ఎవరూ అడ్డుకోజాలరని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఈ వాదనలు కాస్త.. స్థాయి దాటి.. సవాళ్ల రేంజ్ కు వెళ్లిపోయాయి. చంద్రబాబు పర్యటనను అడ్డుకుని తీరతామని మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించడంతో ఈ డైలాగ్ వార్ మరింత హీటెక్కింది. చంద్రబాబు పర్యటనను దమ్ముంటే కేసీఆర్‌ కుటుంబ సభ్యులు వచ్చి అడ్డుకోవాలని తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్‌ రెడ్డి సవాల్‌ చేశారు. మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటనపై టీఆర్ఎస్ సర్కారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరముందని రేవంత్ రెడ్డి అన్నారు. మహేందర్ రెడ్డి ప్రకటన తెలంగాణ ప్రభుత్వ నిర్ణయమా.. వ్యక్తిగత ప్రకటనా.. తేల్చి చెప్పాలని రేవంత్ ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయమైతే.. ఆ ప్రభుత్వంపై గవర్నర్ చర్య తీసుకోవాలని.. వ్యక్తిగత ప్రకటన అయితే.. ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని రేవంత్ డిమాండ్ చేశారు.  ఒక వేళ టీఆర్ఎస్ సర్కారు కనుక చంద్రబాబు పర్యటనను నిజంగా అడ్డుకోదలిస్తే.. అందుకు కేసీఆర్ కుటుంబ సభ్యులైన హరీశ్, కేటీఆర్ స్వయంగా అడ్డుకోవాలని.. రేవంత్ సవాల్ విసిరారు. వారిద్దరకూ చంద్రబాబును అడ్డుకునే దమ్ముంటే అడ్డుకోవచ్చన్నారు. అలా కాకుండా వారు స్వయంగా రాకుండా పార్టీ నేతలను పంపి గొడవ చేయించాలనుకోవడం సరికాదని రేవంత్ అన్నారు. టీఆర్ఎస్ ను విమర్శించే విషయంలో.. దూకుడుగా ఉండే రేవంత్ లేటెస్టు సవాల్ టీఆర్ఎస్ నేతలు డిఫెన్సులో పడేసింది. మరి దీన్ని హరీశ్, కేటీఆర్ సింపుల్ గా తీసుకుంటారో.. లేక.. ఇజ్జత్ కా సవాల్ గా భావించి.. చంద్రబాబును అడ్డుకుంటారో చూడాలి. ఒకవేళ రేవంత్ సవాల్ ను వారు సీరియస్ గా తీసుకుంటే.. తెలంగాణలో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: