తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డాడు రేవంత్ రెడ్డి. దాదాపు ఆరు నెలల నుంచి అప్పడప్పుడు విరామం ఇచ్చినట్టుగానే ఇచ్చి కేసీఆర్ అండ్ కంపెనీపై విరుచుకుపడటాన్ని అలవాటుగా చేసుకొన్న రేవంత్ రెడ్డి మరోసారి అదే దూకుడను ప్రదర్శించాడు. కేసీఆర్ ఆయన తనయుడు మేనల్లుడు అంటూ రేవంత్ రెడ్డి తన నోటికి పనిచెప్పాడు. ఈ సారి విశేషం ఏమిటంటే కేసీఆర్ తెలుగుదేశం నేతలు, ఆంద్రవాలాలతో కొనసాగిస్తున్న స్నేహాలపై రేవంత్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశాడు. కేసీఆర్ ఒకవైపు ఆంధ్రవాళ్లను తిడుతూ వారితో ఎలా స్నేహం చేస్తాడని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది రేవంత్ రెడ్డి వైఖరి. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ సారి రేవంత్ రెడ్డి సుజనాచౌదరిని తన మాటల్లోకి లాగాడు. ఢిల్లీలో కేసీఆర్ , కేటీఆర్ లు సుజనాచౌదరితో సత్సంబంధాలు నడుపుతున్నారని.. ఇది తమకు అనుమానాలను రేకెత్తించే విషయం అని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మరి తమ అనుమానాలను మాత్రం రేవంత్ రెడ్డి బయటపెట్టలేదు. అయినా సుజనాచౌదరి కేంద్ర మంత్రి కాబట్టి.. తెలంగాణ ప్రభుత్వ ప్రముఖులు ఆయనతో సత్సంబంధాలను కలిగి ఉండవచ్చు. దాన్ని తప్పుపట్టడానికే ఏమీ లేదు. రేవంత్ రెడ్డి ఇలా మీడియా ముందుకు వచ్చి.. తమ పార్టీకే చెందిన కేంద్రమంత్రిలో కేసీఆర్ అండ్ కో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని అనడం.. ఒక విధంగా సొంత పార్టీ నేతను కూడా అవమానించడమే. అంటే.. సుజనాచౌదరి కూడా అనుమానాలకు తావిచ్చే స్నేహాలను చేస్తున్నాడనే అభిప్రాయాలను కలిగిస్తున్నాయి రేవంత్ రెడ్డి మాటలు. మరి ఇలాంటి మాటల పరమార్థం ఏమిటో!

మరింత సమాచారం తెలుసుకోండి: