రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) పరిధిలో 13 మంది డెప్యూటీ కలెక్టర్లు మాత్రమే విధి నిర్వహణలో పాల్గొనడంతో భూ సమీకరణలో జాప్యం చోటు చేసుకుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే సి ఆర్‌డి ఎ రూపొందించిన భూ సమీకరణ అంగీకారపత్రం చూసిన రైతులకు అనేక సందేహాలు తలెత్తాయి. న్యాయపరంగా భూ సమీకరణకు చట్టబద్ధత లేదని న్యాయవాదులు వివిధ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి సి ఆర్‌డి ఎ పరిధిలోని గ్రామాల్లో మూడుసార్లు పర్యటించారు. రైతులు భూ సమీకరణకు సహకరిస్తే నష్టపోతారని హెచ్చరించారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం భవనాలు ఇస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయని ప్రచారం చేశారు. బహుళ పంటలు పండే భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే హక్కు లేదని, అవసరమైతే రైతులకు న్యాయ సహాయం అందిస్తామని న్యాయవాదులు, జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి, జన చైతన్య వేదిక సభ్యులు, ప్రజా సంఘాలు ముందుకు వచ్చాయి.్ల నిత్య సమావేశాలతో నిద్ర లేని రాత్రులు గడుపుతున్న రైతులు ప్రభుత్వం మీద నెగ్గలేమనే భయం ఉన్నప్పటికీ, భూ సమీకరణకు చట్టబద్ధత లేకపోతే భవిష్యత్ ఏమిటనే ప్రశ్నకు సమాధానం దొరకక కుంగిపోతున్నారు.  ప్రశాంతతకు మారుపేరైన తుళ్లూరు గ్రామ ప్రజలు ప్రభుత్వ ప్రచారాన్ని నిశితంగా గమనిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు అపోహలు పెట్టుకోవద్దని పదేపదే కోరుతున్నప్పటికీ జరీబు రైతులు ముందుకు రావడం లేదు. మెట్ట ప్రాంత రైతులు కూడా ప్రారంభంలో చూపిన ఉత్సాహాన్ని ప్రస్తుతం చూపడం లేదు. గ్రామాల్లో సమష్ఠి నిర్ణయాలతో ముందుకు వెళ్లాలనే తలంపుతో ఉన్నారు. 3 రోజులుగా రాయపూడిలో మంత్రులు పర్యటిస్తున్నప్పటికీ రైతులు ముందుకు రావడం లేదు. పెనుమాక, ఉండవల్లి గ్రామాల రైతులు పూర్తిగా భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఉండవల్లిలో ఇద్దరు రైతులు ముందుకు వచ్చారు. సుమారు 4.5 ఎకరాల అసైన్డ్ భూమికి సంబంధించిన పత్రాలు ఒక రైతు అందజేశారు. అసైన్డ్భూమి గుంట ప్రాంతంగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. చెరువులు, గుంటలు ప్రభుత్వ ఆస్తులుగా ఉన్నందున రైతు ముందు చూపుతో వ్యవహరించి ఉండారని అధికారులు భావిస్తున్నారు. మరొక రైతు 82 సెంట్ల భూమిని ముందుగానే అమ్మకానికి పెట్టి, బయానా 5 లక్షల రూపాయలు తీసుకుని తర్వాత రెవెన్యూ అధికారులకు పత్రాలు సమర్పించినట్లు ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: