రాజధాని ప్రకటన అనంతరం అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఓ మీడియా సంస్థ కూడా నేలపాడు, శాఖమూరు రెవె న్యూ పరిధిలో 27 ఎకరాలు కొనుగోలు చేసింది. మొత్తంగా రాజధాని వ్యవహారం అధికారపార్టీ నాయకులకు కోట్లు కురిపించింది. అలా భూములు కొనుగోలు చేసిన వారిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్థిక సలహా దారు, ఆయన కుటుంబ సభ్యులూ ఉన్నారు. లింగాయపాలెం, బోరుపాలెం రెవెన్యూ పరిధిలో వీరు భూములు కొన్నట్లు తెలిసింది. రాజధాని ప్రకటన వచ్చిన వెంటనే అధికారపార్టీ నాయకత్వం తుళ్లూరు మండలంలోని పలుగ్రామాల్లో భూముల కొను గోళ్లను అత్యంత వేగంగా పూర్తిచేసింది. విజయ వాడకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఏకంగా కార్పొరేటర్లను పంపించి మరీ భూములు కొన్నారు. రాజధాని ప్రకటనొచ్చిన తరువాత తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో పలు గ్రామాల్లో భూముల విక్రయాలు పెద్దఎత్తున సాగాయి. వీటిని కొనుగోలు చేసినవారిలో ఇద్దరు మంత్రు లుండగా, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఎక్కువమంది కొనుగోలు చేశారు. రియల్‌ఎస్టేట్‌ రంగంలో ఉన్నవారంతా దాదాపు భూములు కొన్నారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఓ మంత్రి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి మధ్యవర్తిత్వంలో 15 ఎకరాల భూమి కొన్నట్లు తెలిసింది. వెలగపూడి, రాయపూడి ప్రాంతాల్లో గుంటూరు జిల్లా మంత్రి పత్తిపాటి పుల్లారావు, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌, వినుకొండ ఎమ్మెల్యే, టిడిపి గుంటూరు జిల్లా అధ్యక్షులు జి.వి.ఆంజనేయులు వేర్వేరు ప్రాంతాల్లో 67 ఎకరాలు కొన్నట్లు తెలిసింది. వీటిని బినామీ పేర్లమీదే కొనుగోలు చేశారు. రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర రాయపూడి పరిసరాల్లో 20 ఎకరాలకుపైబడి భూమి కొనుగోలు చేశారు. గన్నవరం మాజీ ఎంపిపి, టిడిపి నాయకులు బసవారావు రాయపూడిలో 6.50 ఎకరాలు కొన్నారు. గల్లా జయదేవ్‌ గుంటూరు, అమరావతి మధ్యలో సుమారు 140 ఎకరాలు కొన్నట్లు తెలిసింది. స్వతహాగానే భూస్వామిగా ఉన్న జయ దేవ్‌ రాజధానికి ఆనుకుని ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా భూములు కొన్నట్లు సమాచారం. రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మాగంటి మురళీమోహన్‌ ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో 20 ఎకరాలు కొన్నారు. వీరితోపాటు ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి వెంకటేశ్వరరావు బినామీ పేర్లతో ఓ సినీ నిర్మాత పేరుమీద 15 ఎకరాలు కొన్నట్లు తెలి సింది. గుంటూరు జిల్లా మంత్రి పత్తిపాటి పుల్లా రావు భూముల వ్యవహారంపై రాయపూడి పరిస రాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి భూముల కొనుగోళ్లు నిర్వహించారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఇక్కడ ఓ మాజీ ఎమ్మెల్యే సాయంతో 20 ఎకరాల వరకూ కొనుగోలు చేశారు. మాజీ ఎమ్మెల్యే దగ్గరుండి మరీ భూముల వ్యవహారాన్ని నడిపించారు. విజయవాడ ఎంపి కేశినేని నాని కృష్ణాజిల్లా నూజివీడు పరిసరాల్లో 26 ఎకరాల వరకూ కొనుగోలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే నేలపాడు రెవెన్యూ పరిధిలో పది ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహిస్తూ తెలుగుదేశం తరఫున విజయవాడ 47వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఎన్నికైన ఎ.రవికుమార్‌ కూడా భూములు కొన్నారు. తెలంగాణాకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా తాడికొండ సమీపంలో భూములు కొనుగోలు చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన కరణం సింగయ్య, గుంటూరు శ్రీనగర్‌ కాలనీకి చెందిన ప్రతిపాటి నారాయణ పేరుమీద భూముల లావాదేవీలు జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: