రాజకీయాల్లో ఒక్కోసారి భలే తమాషా సంగతులు జరుగుతుంటాయి. రాజకీయంగా ఎంత ప్రత్యర్థులైనా కొన్ని విషయాల్లో ఒకరి మాట మరొకరు వినక తప్పని పరిస్థితి వస్తుంది. నిత్యం.. దుమ్మెత్తిపోసుకునే నేతలు.. అప్పుడప్పుడు ఏకాభిప్రాయానికి వచ్చేస్తారు. ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకుంటారు. అందులోనూ నేతలు ప్రాణంగా భావించే ఎన్నికల విషయంలోనూ రాజకీయ ప్రత్యర్థుల మాటకు విలువ ఇవ్వడం విశేషంగానే చెప్పుకోవాలి. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా... టీడీపీ-వైకాపా ఇప్పుడు ఏకాభిప్రాయానికి వచ్చాయి. తిరుపతి ఎమ్మెల్యే వెంకట రమణ ఆకస్మిక మరణంతో ఈ సీటు ఖాళీ అయ్యి.. ఉపఎన్నికలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లో ఎన్నికకు ఆస్కారం ఇవ్వకుండా మరణించిన వారి కుటుంబ సభ్యులనే ఏకగ్రీవంగా గెలిపించడం ఓ సాంప్రదాయంగా వస్తోంది. ఇందుకు అన్ని పార్టీలు దాదాపు ఓకే చెబుతున్నాయి. ఇప్పుడు తిరుపతి విషయంలోనూ ఏకగ్రీవం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.  అందులో భాగంగానే.. వైసీపీని ఏకగ్రీవానికి ఒప్పించేందుకు టీడీపీ సీనియర్ నేత యనమల రంగంలోకి దిగారు. దావోస్ పర్యటనలో బిజీగా ఉండి కూడా ఆయన ప్రతిపక్షనేత జగన్ కు ఫోన్ చేశారు. తిరుపతి ఉపఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని ఫోన్లో కోరారు. యనమల విజ్ఞప్తికి జగన్ సానుకూలంగా స్పందించారు. పార్టీలో మాట్లాడి ఏ విషయం చెబుతామని సమాధానం చెప్పారు. యనమల ఫోన్ దౌత్యం ఫలించింది. ఫోన్ చేసి మాట్లాడిన కొన్ని గంటలకే.. తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైసీపీ ప్రకటించేసింది. రాజకీయాలకు ఇది సమయం కాదని గ్రహించిన జగన్.. ఏకగ్రీవానికి సహకరించడంతో టీడీపీ వర్గాల్లోనూ సంతోషం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: