భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను తాజ్ మహల్ లోకి అడుగుపెట్టనివ్వబోమని, ఆయనను అడ్డుకుని తీరతామని బీజేపీ ఎంపీ బాబూలాల్ చెబుతున్నారు. ఆగ్రాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే, ఒబామాను అడ్డుకుని తీరతామని ఆయన ఇటీవల చెప్పారు. కేవలం ప్రకటనకే పరిమితం కాని ఆయన ఏకంగా న్యాయవాదులతో తీర్మానం కూడా చేయించారట. గతంలో రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలో ఉన్న బాబూలాల్, ఇటీవల బీజేపీలో చేరి ఫతేపూర్ సిక్రీ (ఆగ్రా రూరల్) లోక్ సభ సభ్యుడిగా విజయం సాధించారు. ఆగ్రాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా అక్కడి న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు. ఈ నెల 17న న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకు ఎంపీ బాబూలాల్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భగా మాట్లాడిన ఆయన లాయర్ల డిమాండ్ న్యాయమైనదేనని వ్యాఖ్యానించారు.న్యాయవాదుల డిమాండ్ కు సానుకూలంగా స్పందించని పక్షంలో ఈ నెల 27న తాజ్ మహల్ కు రానున్న ఒబామాను అడ్డుకుని తీరతామని ప్రకటించి ఆయన సంచలనం రేపారు. మరి హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి సర్కారు నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో బాబూలాల్, గతంలో ప్రకటించిన మేరకు ఒబామాను అడ్డుకుంటారో, మోదీ దెబ్బకు భయపడి మిన్నకుండిపోతారో మరో మూడు రోజుల్లో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: