ప్రణాళికా సంఘం రద్దు, పూర్తిస్థాయిలో నీతి ఆయోగ్ ఏర్పాటు కాకపోవటం వల్ల ఆంధ్రకు ప్రత్యేక హోదా జాప్యమౌతోందని కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రి వైఎస్ చౌదరి పేర్కొన్నారు. ఈలోగా ప్రత్యేక హోదాకు సమానమైన ప్రయోజనాలు కల్పించాలని కేంద్రం నిర్ణయించినట్టు చెప్పారు. తాజా ప్రతిపాదనల వల్ల ఆంధ్రకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రాజెక్టుల ఏర్పాటులో 70శాతం నిధులు గ్రాంటుగా, 30 శాతం రుణం రూపేణా లభిస్తుంది. ప్రత్యేక హోదావల్ల 90శాతం గ్రాంటు, 10శాతం రుణం వస్తుంది. ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్రం ఇప్పటికిప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేనందువల్ల నీతి అయోగ్ ఏర్పాటయ్యే వరకూ 70 శాతం గ్రాంటు, 30 శాతం రుణం స్కీం అమలు చేస్తుంది. శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పరిశ్రమలకు రాయితీ తదితర అంశాలపై చౌదరి వివరించారు. వెనకబడిన జిల్లాలకు ప్రత్యేకాభివృద్ధి ప్యాకేజీ కింద రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాలకు ఒక్కో జిల్లాకు సాలీనా రూ. 60 కోట్లపైన నిధులు గ్రాంటుగా మంజూరు చేస్తుంది. రాయలసీమలోని కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం, ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి వచ్చే ఐదేళ్లలో 20 వేల కోట్ల వరకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. ఈ ఏడాది మార్చిలోపల వెయ్యికోట్లు కేంద్రం విడుదల చేస్తుందని చెప్పారు. రెండు వేల కోట్లు ఇచ్చినా ఖర్చు చేసే పరిస్థితి లేనందువల్ల వెయ్యి కోట్లు కేంద్రం ఇస్తుందని కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌తో ఉందని, ఈమేరకు కూడా కేంద్రం రాష్ట్రాన్ని రకరకాల హెడ్‌ల కింద ఆదుకుంటుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి రాయితీల ప్యాకేజీని కేంద్రం సిద్ధం చేస్తోంది. 15శాతం ఆదాయం పన్ను ప్రోత్సహకాలు, 15 శాతం క్యాపిటల్ అలవెన్సు, 3 శాతం వడ్డీ మాఫీ కింద పరిశ్రమలకు ఇస్తుంది. ఒక ప్రశ్నకు బదులిస్తూ రాజధాని నిర్మాణంపై కూలంకషమైన నివేదిక అడిగిందని, ఈ నివేదిక అందిన వెంటనే నిధులు మంజూరు చేస్తుందన్నారు. రాజధాని నిర్మాణానికి భూసమీకరణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా అన్ని హామీలను అమలు చేసేందుకు కేంద్రం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని, దీనిపై ప్రజల్లో ఎటువంటి అపోహలు అక్కర్లేదన్నారు. ఐఐఎం, ఐఐటి, ఎయిమ్స్, ఐఐఐటి, నిట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, కేంద్ర వ్యవసాయ వర్శిటీ, హార్టీకల్చర్ వర్శిటీ, గిరిజన వర్శిటీ, పెట్రోలియం వర్శిటీ, విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ తదితర సంస్థల ఏర్పాటుదిశగా ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ పనులపై కేంద్రం దృష్టి సారించిందన్నారు. కేంద్రం నిధుల మంజూరులో వెనకడుగు వేసే ప్రసక్తిలేదని చౌదరి స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: