ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ రాజయ్యపై రేపో మాపో వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కెసిఆర్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అవినీతి, అవకతవకలు, స్వైన్ ఫ్లూపట్ల నిర్లక్ష్యం తదితర ఆరోపణలతో ఇప్పటికే ఇద్దరు ఉన్నతాధికారులపై వేటువేసిన సర్కారు, తాజాగా శుక్రవారం మంత్రి పేషీలోని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఒఎస్‌డి), ఇద్దరు పర్సనల్ సెక్రటరీలను (పిఎస్)లను తొలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రికి కనీస సమాచారం లేకుండా ఉత్తర్వులు వెలువడటం ప్రభుత్వ వర్గాలలో చర్చనీయాంశమైంది. వైద్యశాఖలో జరుగుతున్న ప్రక్షాళన చర్యలు, ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో సిబ్బంది తొలగింపు వ్యవహారమంతా ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు అధికారవర్గాల సమాచారం. ఉప ముఖ్యమంత్రి రాజయ్య వ్యవహారంపై ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఆయన నుంచి వైద్యశాఖను తొలగించడం దాదాపు ఖాయమైనట్టేనని సిఎం కార్యాలయ వర్గాల సమాచారం. తనపై వేటు తప్పదేమోనని దిగులుతోవున్న రాజయ్య, శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన స్వైన్‌ఫ్లూ సమీక్షకు వెళ్ళినప్పటికీ, మంత్రిని పక్కనపెట్టి పూర్తిగా అధికారులతోనే ముఖ్యమంత్రి సమీక్షించినట్టు సమాచారం. ఇలాఉండగా, వైద్య ఆరోగ్య శాఖలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య కోటరీలో ఇంకా ఎవరెవరు ఉన్నారని ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.  వైద్యశాఖ మంత్రిగా రాజయ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత నియామకమైన అధికారుల వివరాలను వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయం సేకరిస్తుంది. వైద్య విధాన పరిషత్, కుటుంబ సంక్షేమం, ఆరోగ్యం సంచాలకుల కార్యాలయాలు, జాతీయ ఆరోగ్య మిషన్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డిఎంఇ) ప్రధాన కార్యాలయాల్లో ఇటీవల నియామకమైన అధికారులు, ఉద్యోగుల వివరాలు సేకరిస్తుంది. అలాగే ఇటీవల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నియామకాలు ఏమైనా జరిగాయా? జరిగితే వారి వివరాలు పంపాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు అందాయి. ఉప ముఖ్యమంత్రిపై వేటు వేయడానికంటే ముందుగా ఆయన హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతి ఆరోపణలను పూర్తిస్థాయిలో బహిర్గతం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఉప ముఖ్యమంత్రిపై వేటు వేయడానికి ముందు ఆయన సామాజిక వర్గం నుంచి ఎలాంటి నిరసనలకు ఆస్కారం లేకుండా మంత్రి నిర్వాకాన్ని బయటపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు అధికారవర్గాల సమాచారం. మంత్రి పెషీలో ఒఎస్‌డిగా పని చేస్తున్న డాక్టర్ సంపత్‌తోపాటు కార్యదర్శులు సత్తెయ్య, రవీందర్‌రెడ్డి ఇద్దరినీ తొలగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: