పార్టీలో వైరి వర్గాలు ఒక్కటయ్యాయా.. ఉన్నట్లుండి ఇరువురు ముఖ్య నేతలు ఒకే కారులో వెళ్లడం వెనుక అంతర్యం ఏమిటీ.. అంటూ సొంత పార్టీ నాయకులే ముక్కునవేలేసుకున్నారు. ఇప్పటివరకు టీడీపీకి చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శ్రీనివాస్‌లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. మంత్రి ఉమ అందరినీ కలుపుకొని వెళ్లాలంటూ ఎంపీ కేశినేని నాని బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పార్టీ క్యాడర్ కూడా రెండుగా విడిపోయి పదవుల కోసం పోటీ పడ్డాయి. దీంతో ఇరువురు కలిసి పని చేయాలంటూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి హితవు పలికారు.

నేరుగా చంద్రబాబు కేశినేనిని ఇంటికి పిలిపించి మరీ చెప్పి పంపించారు. అయినా, కొన్ని సందర్భాల్లో ఎంపీ నాని మాత్రం మంత్రి ఉమ తీరును తప్పుపడుతూనే ఉన్నారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామం వద్ద పైలాన్ విషయంలో మూడు రోజుల క్రితం ఎంపీ, మంత్రి వర్గీయులు బాహాబాహీకి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇరువురు నేతలు శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కలిసి ఉండటం విశేషం. చంద్రాలలో ఆటల పోటీలు ప్రారంభించిన తర్వాత మైలవరంలోని ఆస్పత్రికి వెళ్లి లోకేశ్ జన్మదిన వేడుకల్లోనూ పాల్గొన్నారు.

అర్ధగంటపాటు చర్చలు..

పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న నేతలు కేశినేని, దేవినేని ఏకంగా ఒకే ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నారు. ఏమి మాట్లాడుకున్నారనేది మాత్రం టాప్ సీక్రెట్. ఎంపీ కేశినేని నాని ఉదయం చంద్రాలలో జరిగే 78 గ్రిగ్ పోటీలు ప్రారంభించేందుకు వెళుతూ గొల్లపూడిలోని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఇంటికి వచ్చారు. ఇద్దరు సుమారు అరగంట పాటు ఇంట్లో మాట్లాడుకున్నారు. ఏమి మాట్లాడుకున్నారనేది మాత్రం వెల్లడి కాలేదు. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రతినిధి ప్రయత్నించగా, మళ్లీ మాట్లాడతామని బదులిచ్చారు. మొత్తంమీద ఈ పరిణామం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: