ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన వివరాలు చూస్తుంటే.. ఆంధ్రావాసుల కడుపు నిండిపోతోంది. రాష్ట్రం భవిష్యత్తులో పెట్టబోతున్న ప్రగతి పరుగులు తలచుకుని పులకించిపోతోంది. మా బాబు మహా గట్టోడు సుమా.. అంటూ సంతోషపడిపోతున్నారు. వారు అలా ఫీలవడంతో అణువంతైనా అతిశయం లేదు. వాల్ మార్ట్ వంటి దిగ్గజ సంస్థలెక్కడ.. పెప్సికో వంటి అంతర్జాతీయ కంపెనీ ఎక్కడ.. వాటి సీఎంతో సమావేశమవడమే గొప్ప.. అలాంటిది వాళ్లతో కంపెనీలు పెట్టించేస్తామని హామీలు తెచ్చుకోవడం సామాన్యవిషయం ఎంతమాత్రం కాదు.

అవన్నీ ఒక ఎత్తయితే.. లేటెస్టుగా.. చంద్రబాబు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్ బుక్ అధినేతలు, సీఈవోలతో సమావేశమై రాబట్టుకున్న హామీలు మరో ఎత్తు. బాబు విజ్ఞప్తులు, వారి హామీల గురించి తెలుసుకుంటే.. తెలుగునేలకు సాఫ్ట్ వేర్ ను పరిచయం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు 13 జిల్లాల ఆంధ్రాను ఐటీ హబ్ గా మార్చేయబోతున్నారని చెప్పకతప్పదు.

అంతెందుకు.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చంద్రబాబును కలుసుకునేందుకు పడిన తాపత్రయం గురించి తలచుకుంటే ఎంత గర్వంగా ఉంది. పదేళ్ల తర్వాత బాబును చూసి ఆయన ఉద్వేగానికి లోనయ్యారంటే.. ఆ బిజినెస్ మేన్ లో గుండెల్లో బాబు ఎంతగా గూడు కట్టుకున్నారో చెప్పడం కష్టమే. ఆంధ్రాలో మైక్రోసాఫ్ట్ కేంద్రం వస్తుందంటేనే.. ఒళ్లు పులకరించడంలేదూ..

అంతా బాగానే ఉంది. భవిష్యత్ ఎంతో అందంగా కనిపిస్తోంది. కానీ ఓ చిన్న అనుమానం. దావోస్ పర్యటన వివరాలన్నీ అందిస్తోంది ఏపీ సీఎంఓ మాత్రమే. వాల్ మార్ట్ , పెప్సికో హామీల గురించి చెప్పందీ సీఎంఓ కార్యాలయమే. బిల్ గేట్స్, బాబు భేటీ - మైక్రోసాఫ్ట్ కేంద్రం వాగ్దానం గురించి వివరించిందీ ఏపీ సీఎంఓ ప్రతినిధులే. అంతకుమించి ఆయా కంపెనీల అధికారిక ప్రకటనలేమీ లేవు. అలాగని ఏపీ సీఎంఓ అబద్దాలు చెప్పిందనీ అనలేం.. నిజంగా అంత సీనుంటే.. అంతకుమించి కావల్సిందేముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: