సీబీఐ.. ఒకప్పుడు ఈ పేరు చెబితే.. కేసులు తెగవు, ముడిపడవు అనే అపవాదు ఉండేది. అలాంటి వ్యవస్థను సీబీఐ డీఐజీగా బాధ్యతలు స్వీకరించి, ఆ తర్వాత పదోన్నతిపై జేడీగా కొనసాగిన లక్ష్మీనారాయణ గాడిలో పెట్టారు. సీబీఐ అంటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. సుదీర్ఘకాలం డిప్యూటేషన్‌పై కొనసాగినా.. సమర్థతకు పట్టం కట్టిన గత ప్రభుత్వం ఆయనను మరో రెండేళ్లు పొడగించింది. కీలక కేసుల బాధ్యతను అప్పగిం చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసుల్ని ఆయన స్వీకరించారు. లక్ష్మీనారాయణ మాతృసంస్థకు తిరిగి వెళ్లగానే.. సీబీఐ పరిస్థితి మళ్లిd మొదటికొచ్చింది. ఇందుకు గాలి జనార్దన్‌ రెడ్డి కేసు ప్రత్యక్ష నిదర్శనం. ఓబులాపురం గనుల్లో అక్రమాలు జరుగుతున్నాయం టూ దాఖలైన పిటిషన్‌కు స్పందించిన సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలకు సీబీఐ చీఫ్‌గా ఉన్న లక్ష్మీనారాయణకు ఈ కేసు బాధ్యతలు అప్పగించారు. ఆయన స్వయంగా ఓబులాపురం గనులను సందర్శించి, అక్రమాలను గుర్తించారు. పక్కా ఆధారాలు లభించడంతో.. 2011 సెప్టెంబరు 5న బళ్లారిలో గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డిలను అరెస్టు చేశారు. ఈ కేసులో మరికొందరు నిందితులను గుర్తించారు. దాదాపు రూ.40వేల నుంచి రూ.50వేల కోట్లను గాలి జనార్దన్‌రెడ్డి అక్రమంగా అర్జించాడని గుర్తించారు. సీబీఐతో పాటు ఈడీ కూడా ఫెరా, ఫేమా చట్టాల కింద కేసులు నమోదు చేసి, సమాం తర దర్యాప్తు ప్రారంభించింది. చివరకు బెయిల్‌ కోసం ముడు పులు ఇచ్చిన కేసు కూడా గాలి జనార్దన్‌రెడ్డిపై నమోదైంది. అసోసియేట్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌, బళ్లారి ఫోర్ట్‌ ఐరన్‌ ఓర్‌ ఎక్స్‌పోర్ట్‌ కేసుల్లో కీలక ఆధారాలు సేకరించారు. ఏడు ప్రధాన కేసులతో పాటు.. 22 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. బెయిల్‌ రాకుండా.. సీబీఐ జేడీగా లక్ష్మీనారాయణ కొనసాగినంత కాలం గాలి జనార్దన్‌ రెడ్డి ఎప్పుడు బెయిల్‌ పిటిషన్‌ వేసినా.. శక్తిమంతమైన కౌంటర్‌ దాఖలు చేసి, బెయిల్‌ రాకుండా అడ్డుకున్నారు. ఆయన బయటకు వస్తే.. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదముందని పేర్కొన్నారు. ఆయన మాతృసంస్థకు బదిలీ అయ్యాక.. ఈ కేసుతో పాటు, పలు సంచలన కేసుల విషయంలో సీబీఐ దర్యాప్తులో పురోగతి మందగించిందని తెలుస్తోంది. తాజా బెయిల్‌ పిటిషన్‌ సందర్భంగా సీబీఐ స్వయంగా షరతులతో కూడిన బెయిల్‌ ఇస్తే తమకు అభ్యంతరం లేదని పేర్కొంది. ఈ కేసులో.. సీబీఐ తొలుత పేర్కొన్నట్లు విదేశీ నిధులకు సంబంధించి ఇంకా సాక్ష్యాధారాలు సేకరించాల్సి ఉంది. గాలి జనార్దన్‌రెడ్డి ఇక్కడ అక్రమంగా సంపాదించిన మొత్తాన్ని సింగపూర్‌, మారిషస్‌, బ్రిటన్‌లకు అక్రమ మార్గాల్లో తరలించారని ప్రధానంగా సీబీఐ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఆ అంశంపై దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. 2012లో సీబీఐ బెంగళూరు విభాగానికి విదేశీ నిధులపై లీడ్‌ రావడంతో.. ఆ దిశలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఈ మూడు దేశాలకు లేఖలు రాశారు. గాలి పేరిట, అతని బినామీల పేరిట, పలు కంపెనీల పేరిట భారత్‌ నుంచి డబ్బు తరలినట్లు గుర్తించామని, వాటి వివరాలు అందజేయాల్సిందిగా ఆ లేఖల్లో కోరారు. ఆయా దేశాల నుంచి స్పందన కరవవ్వడంతో లేఖల పరంపరను కొనసాగించారు. 'మారిషస్‌, సింగపూర్‌ దేశాలు ఈ విషయంపై మచ్చుకైనా స్పందించలేదు సరికదా.. అసలు కారణాలపై ఆరా తీసిన దాఖలాలు కూడా లేవు' అని బెంగళూరు సీబీఐ విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపారు. బ్రిటన్‌ ప్రభుత్వం మాత్రం గత ఏడాది అక్టోబరులో స్పందిస్తూ.. ప్రత్యుత్తరం రాసింది. అందులో పలు ప్రశ్నలు వేసి, వాటికి సంతృప్తికరమైన సమాధానాలిస్తే.. సీబీఐ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. 'ఆ ప్రశ్నలకు సమాధానాలివ్వడం సాధ్యమయ్యే పనికాదు. వాటికి సమాధానాలిచ్చే అవకాశాలు లేవు', అని సదరు సీబీ అధికారి వివరించారు. దీన్ని బట్టి.. బ్రిటన్‌ స్పందించినా.. పెద్దగా ప్రయోజనం ఉంటుందనే ఆశలు అడియాసలైనట్లేనని సీబీఐ వర్గాలు అంటున్నాయి. విదేశాలకు తరలించిన నిధులను కలుపుకొని మొత్తం గాలి ఆస్తులు రూ.40వేల నుంచి రూ.50వేల కోట్లు ఉంటుందని తొలుత అంచనా వేసిన సీబీఐ.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.5వేలకు తగ్గించడం గమనార్హం. ఇందులోనూ గాలి జనార్దన్‌రెడ్డి విలాసవంతమైన భవనం, హెలికాప్టర్‌, ఖరీదైన కార్లు, ఇక్కడున్న స్థిర చరాస్తులను కలిపి లెక్క కడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలోనూ.. పక్కా ఆధారాలు సంపాదించేందుకు సీబీఐ ప్రయత్నిస్తున్నా.. గాలి జనార్దన్‌ రెడ్డి ఇప్పుడు బెయిల్‌పై బయటకు వచ్చిన నేపథ్యంలో.. అది కష్టతరమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఓఎంసీ కేసులో.. సరిహద్దు వివాదాలు, పరిధికి మించి మైనింగ్‌ తదితర అంశాలపై సీబీఐ పక్కా ఆధారాలు సేకరించింది. విదేశీ నిధుల విషయంలో సీబీఐ ముందు ఇప్పుడున్న ఒకే ఒక్క మార్గం.. ఎఫ్‌ఐయూ-ఐఎన్‌డీ (ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ - ఇండియా) సహకారం మాత్రమే. ఈ సంస్థ ఆర్థిక శాఖ మంత్రి నేతృత్వంలో పనిచేస్తుంది. అయితే.. గాలి జనార్దన్‌ రెడ్డి సొంత పార్టీయే కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో.. ఆ దిశలో సహకారం లభిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: