మొన్న ధాన్యం సేకరణపై సమీక్ష.. ఇప్పుడు స్మార్ట్ సిటీలపై రివ్యూ..! ఇలా వరుసగా ఎన్టీఆర్ భవన్లో యువనేత లోకేష్ ఆధ్వర్యంలో సమీక్షలు చేయడానికి కారణాలేంటి..? అసలు ఏ హోదాలో చిన్న బాబు రివ్యూలు చేస్తున్నారు..?వీటికి స్కూల్ పిల్లల్లా మంత్రులంతా ఫైల్స్ పట్టుకుని ఎందుకు హాజరవుతున్నారు..? అసలు తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది..? ప్రస్తుతం ఇదే చర్చ అటు ప్రభుత్వంలోనూ..ఇటు పార్టీ వర్గాల్లోనూ జోరుగా సాగుతోంది. మొన్న ధాన్యం సేకరణపై..ఇప్పుడు స్మార్ట్ సిటీలపై..ఈ రెండు సమీక్షలు కూడా లోకేష్ ఆధ్వర్యంలోనే నడిచాయి. అవి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో లేనపుడే జరిగాయి. అయితే చిన్నబాబు వరుస రివ్యూల వెనక రీజనేంటి..? లోకేష్ను ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా పాలుపంచుకునేలా చేయాలని చంద్రబాబు భావిస్తున్నారా.. లేకపోతే మంత్రులపై నమ్మకం లేక ఈ విధంగా జరుగుతోందా. ఇప్పుడు ఇవే ప్రశ్నలు ప్రభుత్వ... పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన చిన్నబాబు బర్త్డే వేడుకలను కూడా..మంత్రులు దగ్గరుండి ఘనంగా నిర్వహించారు. దీంతో మంత్రులు చిన్నబాబు భజన చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నారా లోకేష్ ప్రస్తుతం టీడీపీ కార్యకర్తల సమన్వయ కమిటీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే పార్టీ పదవిలో ఉన్న లోకేష్..ఏ హోదాలో ప్రభుత్వకార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ విపక్షాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు లోకేష్ సమీక్షలు నిర్వహించడంలో ఎటువంటి తప్పు లేదంటున్నారు మంత్రులు. లోకేష్ రాజ్యాంగ శక్తిగా వ్యవహరిస్తే తప్పు అని, అలా కాకుండా ప్రజా సంక్షేమానికి పార్టీ తరపున సూచనలు ఇస్తే తప్పు కాదని చెప్పుకొచ్చారు. ముందు పార్టీ కార్యకర్తలమని..ఆ తర్వాతే మిగతా వ్యవహరాలంటున్నారు అమాత్యులు. లోకేష్ ప్రమేయం అటు పార్టీలోనూ..ఇటు ప్రభుత్వ వ్యవహరాల్లోనూ క్రమంగా పెరుగుతోంది. కొంతమంది అధికారుల బదిలీల విషయంలోనూ లోకేష్ జోక్యం చేసుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.లోకేష్కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు..అనధికారికంగా సచివాలయంలో కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. మంత్రులకు పీఏలు..పీఆర్వోల నియామకంలోనూ లోకేష్ కీలక పాత్ర పోషించారన్న వార్తలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చిన్నబాబు నిర్వహిస్తున్న వరుస సమీక్ష విషయంలోనూ విమర్శలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: