రాష్ర్ట నూతన రాజధాని విషయంలో ప్రభుత్వం అతిగా అంచనాలు వేసుకుంటోంది. మన ఇతిహాసాలలో చూస్తుంటాం... మాంత్రికుడు ఓంహ్రీం అనగానే నగరం వెలుస్తుంది. ఆ టైపులో రాజధానిని నిర్మించాలనే తపనతో చంద్రబాబు ఉన్నాడు. మొదట అద్భుతమైన, అది కూడా సింగపూర్ లాంటి రాజధానిని కడితేగాని రాష్ర్టంలో ప్రజలు బ్రతకలేరన్నట్లుగా వుంది చంద్రబాబు వ్యవహారశైలి. రాష్ర్టంలో మిగతా పనులన్నీ వదిలేసి ఒక్క రాజధాని నిర్మాణమే ప్రధానమన్నట్లు దానిపై పడ్డారు. తుళ్లూరు కేంద్రంగా వేలాది ఎకరాల భూసమీకరణ మొదలైంది. సింగపూర్ కంపెనీలకు రాజధాని పనులు అప్పగించారు. తుళ్లూరు రాజధాని అయితే భవిష్యత్ లో 80లక్షల మంది దాకా అక్కడికి వస్తారని, హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందుతుందని ఆశపడుతున్నారు. ఇది అతిఅంచనా. హైదరాబాద్ కు వందలఏళ్ళ చరిత్ర వుంది. చారిత్రాత్మక నేపథ్యముంది. నిజాంలకాలం నుండి హైదరాబాద్ ఓ వెలుగు వెలిగింది. ఏపికి రాజధాని అయ్యాక శరవేగంగా అభివృద్ధి చెందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల నుండి ప్రజలు ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా అక్కడ స్థిరపడ్డారు. అందరూ పెట్టుబడులు పెట్టారు. కాబట్టే హైదరాబాద్ ఈరోజు అంతర్జాతీయ నగరం స్థాయికి ఎదిగింది. తుళ్లూరుకు అంతటిసీన్ రావాలంటే వందలఏళ్లు దాటడం ఖాయం. ముఖ్యంగా ఏపిలోని 13జిల్లాల ప్రజలు అక్కడికి వలసపోయే పరిస్థితులు లేవు. భూముల ధరలు ఆకాశాన్నంటే నేపథ్యంలో పెట్టుబడులకు అవకాశాలు తక్కువ. సింగపూర్ రాజధాని మాయలో అతిగా ఆశలు పెంచుకుని అక్కడి రైతులను నాశనం చేయడం తప్పితే రాజధాని వల్ల ఎవరికీ మేలు జరిగే అవకాశం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: