తెలుగు జర్నలిజం పార్టీల వారీగా విడిపోయిందని సిసలైన పాత్రికేయులు ఎప్పటి నుంచో బాధపడుతున్నారు. ప్రస్తుతం ప్రధాన పత్రికలన్నీ ఏదో ఒక పార్టీకి కొమ్ముకాస్తున్నవే అని చెప్పడంలో సందేహం లేదు. ఐతే వార్తను ఎవరు ఎవరికి అనుకూలంగా ప్రజెంటే చేసుకున్నా.. వాస్తవాల విషయంలో మాత్రం తేడాలు ఉండకూడదు. ఈనాడు పత్రిక చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు రాస్తుందన్నది ఎప్పటి నుంచో ఉన్నటాక్.. ఇక సాక్షి ఏకంగా ప్రతిపక్షనాయకుడి కుటుంబం ద్వారా నిర్వహించబడుతున్న పత్రిక.  ఒబామా రాక సందర్భంగా రాష్ట్రపతి ఆయనకు విందు ఇస్తారు. ఈ విందుకు దేశంలోని ప్రముఖులను ఆహ్వానిస్తారు. ఈ విందుకు చంద్రబాబుకు ఆహ్వానంపై ఈనాడు, సాక్షి భిన్నకథనాలు ఇచ్చాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇస్తున్న విందులో పాల్గొనాలని సీఎం చంద్రబాబు భావించారని.. ఆహ్వానం అందితే హాజరుకావాలనుకున్నారని సాక్షి రాసింది. ఈ విషయమై తన కార్యాలయ అధికారులతో చంద్రబాబు సంప్రదింపులు జరిపారని.. ఆహ్వానం వచ్చిందా..అని అడిగారని రాసింది. ఐతే శనివారం రాత్రి వరకూ ఆయనకు ఆహ్వానం అందలేదని.. అందుకే దావోస్ నుంచి వచ్చిన రోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లాలని నిర్ణయించుకున్నారని రాసింది.  ఈనాడు మాత్రం ఇందుకు విరుద్ధంగా రాసింది. ఆదివారం ఒబామా గౌరవార్థం ఇస్తున్న విందుకు చంద్రబాబుకు ఆహ్వానం అందిందని రాసింది. అంతే కాదు.. సోమవారం రాష్ట్రపతిభవన్లో రాష్ట్రపతి ఇచ్చే విందుకు కూడా బాబుకు ఆహ్వానం అందిందని రాసింది. ఐతే రిపబ్లిక్ డే ఉత్సవాలు ఉన్నందువల్ల.. చంద్రబాబు ఈ విందులకు హాజరుకాకపోవచ్చని రాసింది. ఇంతకీ చంద్రబాబుకు ఆహ్వానం అందినట్టా..? లేదా.? సాక్షి రాసింది నిజమేతే.. ఈనాడు బాబు కోసం కలరింగ్ ఇచ్చిందా.. లేదా ఈనాడు రాసింది నిజమైతే.. సాక్షి చంద్రబాబుపై దుష్ప్రచారం చేసిందా.. ఇంతకీ ఏదినిజం..?

మరింత సమాచారం తెలుసుకోండి: