ఎంత ప్రతిభ ఉన్నా.. దానికి తగిన గుర్తింపు లేకపోతే.. ప్రజల్లో ప్రాచుర్యం ఉండదు. అందులోనూ ప్రభుత్వం ఇచ్చే అవార్డులకు విలువ, గౌరవం ఎక్కువే. అందుకే పద్మ అవార్డులకు ఎంతో క్రేజ్ ఉంది. ఐతే ఈ ఏడాది ప్రకటించిన పద్మ అవార్డులు తెలుగు రాష్ట్రాలను కొద్దిగా నిరాశపరిచాయనే చెప్పాలి. రెండు రాష్ట్రాలు చెరో 20 మొత్తం 40 పేర్లు పంపించినా కేంద్రం వారిలో కేవలం ఏడుగురినే పద్మ అవార్డులకు ఎంపిక చేసింది.  చంద్రబాబు సర్కారు సిఫారసు చేసిన 20 మందిలో క్యాన్సర్ వ్యాధి నిపుణుడు నోరి దత్తాత్రేయుడు, నటుడు కోట శ్రీనివాసరావు, వయెలిన్ విద్వాంసురాలు అవసరాల కన్యాకుమారి పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. పద్మభూషణ్ కేటగిరీలో ఏపీకి నిరాశే ఎదురైంది. ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు దివంగత బాపు, వైద్యుల డి. నాగేశ్వర్ రెడ్డి, విద్యావేత్త రాజ్ రెడ్డిలకు ఈ కేటగిరిలో అవార్డులకు సిఫార్సు చేసినా ఫలితం దక్కలేదు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు, నటుడు మురళీ మోహన్, ఈనాడు కార్టూనిస్టు శ్రీధర్, సీనియర్ పాత్రికేయులు ఐ వెంకట్రావుల పేర్లు బాబు పద్మశ్రీకి పంపినా.. మొండిచెయ్యే ఎదురైంది.  చంద్రబాబు పరిస్థితి ఇలా ఉంటే.. కేసీఆర్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. తెలంగాణ పంపిన 20 మంది జాబితాలో కేవలం ఒకే ఒక్కరికి పద్మ అవార్డు దక్కింది.. మహిళా క్రికెటర్ మైదీలీ రాజ్ కు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం సిఫారసు మేరకు అవార్డు దక్కింది. తెలంగాణకు చెందిన పీవీ సింధు, రఘురామ్, మంజులకు పద్మశ్రీలు వచ్చినా.. అవి తెలంగాణ ప్రభుత్వం సిఫారసు లేకుండానే వచ్చాయి. దివంగతులు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఫ్రొఫెసర్ జయశంకర్ తదితరుల పేర్లతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా నిరాశే ఎదురైంది. వీరి కోసం కేసీఆర్ ప్రత్యేకంగా లేఖ రాసినా ఉపయోగం లేకుండా పోయింది.

.

..

.

మరింత సమాచారం తెలుసుకోండి: