పంట రుణ బకాయిలపై బ్యాంకర్లు దృష్టిసారించారు. రుణ మాఫీ తొలిదశలో 30 శాతం మొత్తాన్ని ప్రభుత్వం జమచేసిన సంగతి తెలిసిందే. మిగిలిన బకాయిలను రాబట్టుకోవడానికి బ్యాంకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామాలకు వెళ్లి రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. కాదూకూడదంటే కనీసం రెన్యువల్‌ చేయించుకుని కొత్త అప్పుగా మార్చుకోమని బతిమలాడుతున్నారు. బ్యాంకర్ల సూచనను రైతులు పట్టించుకునే పరిస్థితిలో లేరు. పూర్తి రుణమాఫీపై ఆశలు పెట్టుకున్న అన్నదాతలు.. రుణాల రెన్యువల్‌పై ఆసక్తి చూపడం లేదు. మిగిలిన బకాయికి సంబంధించిన సొమ్ము జమయ్యేదాకా రుణం చెల్లించకూడదన్న ఆలోచనలో ఉన్నారు. ఇదే జరిగితే... ఎక్కువ మంది ఖాతాదారులు డిఫాల్టర్లుగా మారుతారని, దీనివల్ల బ్యాంకుకు ఆర్థిక ఇబ్బందులెదురవుతాయని బ్యాంకర్లు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రైతులూ వడ్డీల ఊబిలో కూరుకుపోయే ప్రమాదముంది. చిత్తూరు జిల్లా నగరి ఎస్‌బిఐ బ్రాంచిలో ఇప్పటిదాకా దాదాపు వెయ్యి ఖాతాలకు తొలిదశ రుణమాఫీ సొమ్ము సర్దుబాటు చేశారు. వీరిలో పాస్‌బుక్‌పై పంట రుణం తీసుకున్నవారు, పంటల సాగు కోసం బంగారం తాకట్టుపెట్టి రుణం తీసుకున్నవారు ఉన్నారు. ప్రభుత్వం సూచించినట్లు మొదటి దశ మాఫీ సొమ్ము పోను మిగిలిన మొత్తం చెల్లించి రుణాలను రెన్యువల్‌ చేయించుకోవాలని అధికారులు రైతులకు చెబుతున్నారు. అప్పుడు పాత అప్పుగా పరిగణించి 14 శాతం వడ్డీ వసూలు చేస్తామని, అప్పు తీరేదాకా కొత్త అప్పు కూడా ఇవ్వడానికి అవకాశముండదని వివరిస్తున్నారు. అయినా రైతుల నుంచి స్పందన రావడంలేదు. దీంతో అధికారులు గ్రామాల బాట పట్టారు. ఇంటింటికీ వెళ్లి రైతులను వ్యక్తిగతంగా కలిసి రెన్యువల్‌ చేసుకోవాల్సిన అవసరంపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం మొత్తం ఐదు దశల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తానని ప్రకటించింది. ప్రభుత్వమూ చెల్లించ కుండా, రైతులూ చేతులెత్తేసే పరిస్థితి వస్తే... నాలుగేళ్ల తరువాత చేసేదేమీ ఉండదని, బ్యాంకులు నష్టాల్లో మునిగిపోతాయని అధికారులు వాపోతు న్నారు. నిబంధనల ప్రకారం మూడేళ్లు దాటిన రుణాలకు సంబంధించిన బంగారాన్ని వేలం చేయడానికి బ్యాంకులకు అధికారముంటుంది. ఇప్పటికే గడువు దాటుతున్న ఖాతాలూ ఉన్నాయి. వీటికి వేలం నోటీసులిస్తే ప్రభుత్వం నుంచి తమపై ఒత్తిడి వస్తుందని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. మూడేళ్ల తరువాతైనా బంగారమంతా ఒకేసారి వేలమేస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావిస్తున్నారు. అందుకే సాధ్యమైనంత వరకు రైతులతో రుణాలు రెన్యువల్‌ చేయించాలని బ్యాంకర్లు ప్రయత్నిస్తున్నారు. రెన్యువల్‌ చేయించుకుంటే ఏడు శాతం వడ్డీతో పోతుంది. లేకుంటే 14 శాతం చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వం మాఫీ చేస్తామన్న రుణంపై 10 శాతం వడ్డీ మాత్రమే చెల్లిస్తామని చెబుతోంది. మిగిలిన 4 శాతం రైతు భరించాల్సి ఉంటుంది. రెన్యువల్‌ చేయించుకుంటే మూడు శాతం రైతుకు మిగులుతుంది. మరోవైపు పాత బకాయి ఉంటే బ్యాంకులు కొత్త అప్పు ఇవ్వవు. అంటే మరో నాలుగేళ్లు బ్యాంకుల నుంచి రుణం పొందే అవకాశముండదు. అధిక వడ్డీకి ప్రయివేటు వ్యక్తుల నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితేర్పడుతుంది. తాకటు ్టపెట్టిన బంగారం బ్యాంకులోనే ఉండిపోతుంది. రెన్యువల్‌ చేయించకుంటే కలిగే నష్టంపై రైతులకు అవగాహన లేకపోవడంతోనే వారు సానుకూలంగా స్పందించడంలేదని బ్యాంకర్లు అంటున్నారు. రెన్యువల్‌ చేయించుకోవాలని ఉన్నా... ఇప్పటిక ిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలన్న ఆందోళన కొందరిది. పుస్తక సర్దుబాటు చేయడానికి కొందరు బ్యాంకర్లు సిద్ధంగా ఉన్నా... కొత్త రుణంగా మార్చుకుంటే ఆ తరువాత మాఫీ వర్తిస్తుందో, లేదో అనే భయం రైతులను వెంటాడుతోంది. అందుకే రెన్యువల్‌పై వారు అంతగా ఆసక్తి చూపడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: