అమెరికాతో వ్యూహాత్మక సంబంధాల విషయంలోగానీ, అణు ఒప్పందం విషయంలోగానీ ఏ అంశాలనైతే బిజెపి గతంలో ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేకించిందో నేడు అధికారంలోకి వచ్చిన తరువాత వాటినే నెత్తికెత్తుకుంటోంది. యుపిఎ ప్రభుత్వం అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బిజెపి తీవ్రంగా వ్యతిరేకించింది. మన్మోహన్‌ ప్రభుత్వం దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పడుతోందని విమర్శించింది. కానీ నేడు మోడీ ప్రభుత్వం యుపిఎకి మించి పోయి అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యంలోకి వెళ్లిపోతోంది. రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలకు రావడం, ఒబామా పర్యటన సందర్భగా ఇరాన్‌ నుండి చమురు దిగుమతులు తగ్గించుకోవడం చేస్తోంది. రెండో వైపు, యుపిఎ హయాంలో అమెరికాతో కుదిరిన అణు ఒప్పందంలో అణు బాధ్యత చట్టాన్ని బిజెపి వ్యతిరేకించింది. దాంతో ఒప్పందంలో ప్రభుత్వం అనేక నిబంధనలు చేర్చింది. నిబంధనలు చేర్చిన తరువాత పార్లమెంటులో రెండూ పార్టీల ఏకాభిప్రాయంతో చట్టం ఆమోదం పొందింది. ఈ నిబంధనలే నేడు అణు ఒప్పందం ముందుకు పోవడానికి ప్రతిబంధకాలుగా మారాయని మోడి ప్రభుత్వం గగ్గోలు పెడుతోంది. ఒబామా రాకముందుగానే ఈ నిబంధంనలను తొలగించి అమెరికా అధ్యక్షులకు నజరానాగా ఇవ్వదలుచుకుంది. రెండు మూడు రోజులుగా లండన్‌లో ఇరుదేశాల అధికారు మధ్య చర్చల్లో ఈ నిబంధనలను నీరుగార్చుతూ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా ప్రయివేటు కంపెనీలు నిర్మించే అణు కర్మాగారాల్లో ప్రమాదాలు జరిగితే నష్ట పరిహారాన్ని ఆ కంపెనీలే చెల్లించేట్లు యుపిఎ ప్రభుత్వం నిబంధనలు చేర్చింది. ఇప్పుడు ఈ నష్ట పరిహారం బాధ్యత మొత్తం భారత ఇన్సూరెన్స్‌ కంపెనీల కన్సార్టియం, భారత ప్రభుత్వం మోసేట్లుగా నిబంధనలు సడలించినట్లు చెబుతున్నారు. ''చట్టంలోని అనేక నిబంధనలు, ముఖ్యంగా 17ఎ, 17బి, 46 నిబంధనలను నాటి ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌ జెట్లీ ఒత్తిడి వల్లనే చేర్చాం, అది చట్టంగా మారింది'' అని కాంగ్రెస్‌ నాయకుడు, రాజ్యసభలో పార్టీ ఉప నాయకుడు ఆనంద శర్మ వాపోయారు. ఇప్పుడు అదే బిజెపి, నిబంధనలను సడలించబూకుంటోందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: