టీఆర్‌ఎస్‌కు మరో ఉప ఎన్నిక పరీక్ష వస్తోంది. కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో వరంగల్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ఎన్నిక అనివార్యం కాగా... టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కడియం శ్రీహరికి పెద్ద సవాలేనని రాజకీయ విశ్లేషకుల అంచనా. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు సైతం ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. గులాబీ వర్గాల్లో ఈ అంశంపై ఇప్పటికే చర్చ మొదలైంది. వరంగల్ లోక్‌సభ స్థానం ఎస్సీ రిజర్వేషన్ కావడంతో టీఆర్‌ఎస్‌లోని ఈ వర్గం నేతల్లో ఎవరికి అవకాశం వస్తుందనే అంశంపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేసిన చాలా మంది ఎస్సీ వర్గం నేతలు ఆ తర్వాత కాలంలో పార్టీకి దూరమయ్యారు.  2014 ఎన్నికలకు ముందు ఇది ఎక్కువగా జరిగింది. కొందరు పార్టీ మారగా, మరికొందరు స్తబ్దుగా ఉన్నారు. 2014 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్... పార్టీలో గెలిచే స్థాయి నేతలు లేరనే ఉద్దేశంతో కడియం శ్రీహరిని తీసుకున్నారు. కేసీఆర్ అంచనాలకు తగినట్లుగానే ఈ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ స్థానాన్ని టీఆర్‌ఎస్ గెలుచుకుంది. ఇప్పుడు కడియం రాజీనామా చేయనున్న నేపథ్యంలో అభ్యర్థిత్వం విషయంలో టీఆర్‌ఎస్ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అన్యూహ రాజకీయాలు, నియామకాలకు చిరునామాగా ఉండే గులాబీ పార్టీలో వరంగల్ లోక్‌సభ అభ్యర్థి ఎవరు అనే దానిపై ఇప్పటికిప్పుడు స్పష్టత రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: