చొక్కాలు మార్చినంత సులభంగా పార్టీలు మార్చడం ఇప్పుడు చాలా కామనైపోయింది కానీ.. ఒకప్పుడు చాలా అరుదుగా పార్టీలు మారేవారు. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందరికో రాజకీయ జీవితాన్నిచ్చింది. ఇప్పటి ఆంధ్రా సీఎం మొదలుకుని ఎందరో నేతలు కాంగ్రెస్ ద్వారా రాజకీయరంగంలో అడుగుపెట్టినవారే. కాంగ్రెస్ తర్వాత తెలుగునేలలో ఎందరికో రాజకీయ జన్మనిచ్చిన ఘనత ఎన్టీఆర్ దే. తెలుగుదేశం స్థాపనతో ఎందరో యువకులు అప్పట్లో రాజకీయాల్లో అడుగుపెట్టి.. ఆ తర్వాత కాలంలో మంచి నాయకులుగా గుర్తింపు పొందారు.  ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఎన్టీఆర్ హయంలో మంత్రిగా పనిచేసిన వారే. తెలుగుదేశం పార్టీలో చేరి.. 1985లో శాసనసభకు ఎన్నికయ్యారు. 1987-88 కాలంలో ఎన్టీఆర్ మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించారు. 1997-98లో కేబినెట్ హోదా మంత్రి పదవి లభించింది. ఆ తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం దొరక్కపోవడం వల్లే తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించారని.. మంత్రిపదవి ఇచ్చుంటే.. పార్టీ పెట్టేవారే కాదని ఆయన విమర్శకులు అంటుంటారు.  కేసీఆర్ తో పాటే తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి కూడా ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు. మిగిలిన ఇద్దరూ కూడా చాలా సమర్థులుగా పేరు తెచ్చుకున్నవారే. వీరిద్దరూ కేసీఆర్ టీఆర్ ఎస్ పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత కూడా అందులో చేరలేదు. తెలుగుదేశం నీడలోనే ఉన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ లపై పోరాడారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పదనుకున్న తరుణంలో కడియం పార్టీ మారగా.. తుమ్మల కొద్దినెలల కిందటే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. లేటెస్టుగా.. రాజయ్య బర్తరఫ్ తో కడియం శ్రీహరికి అనూహ్యంగా ఉపముఖ్యమంత్రి పదవి అందివచ్చింది. మొత్తానికి కేసీఆర్, తుమ్మల, కడియం వంటి దిగ్గజాలను చూస్తుంటే.. ఆనాటి ఎన్టీఆర్ మంత్రివర్గం గుర్తుకురాకమానదు.

మరింత సమాచారం తెలుసుకోండి: