రాష్ట్రవిభజన నాయకుల్లోనే కాదు దేవుళ్లలోనూ పోటీ వాతావరణం కల్పిస్తోంది. ఇప్పటికే తిరుపతికి పోటీగా యాదగిరి గుట్టను అభివృద్ధి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆమేరకు నిధులు కూడా విడుదల చేశారు. మాస్టర్ ప్లాన్ రూపొందిస్తూ.. చకచకా అభివృద్ది దిశగా అడుగులు వేయిస్తున్నారు. మరోవైపు తెలంగాణలోని భద్రాచలం ఆలయానికి పోటీగా కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేయాలని అక్కడి నాయకులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆమేరకు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.  ఈ నేపథ్యంలో తెలంగాలోని మరో ఆధ్యాత్మిక క్షేత్రానికి తిరుపతి తరహాలో అభివృద్ది చేయాలన్న వాదన వినిపిస్తోంది. అదే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని సిద్దుల గుట్ట. ఆర్మూర్ పట్టణాన్ని ఆనుకుని ఉన్న కొండలపై ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలు కొలువుదీరాయి. గుట్టపై శివాల‌యం, రామాల‌యం, హ‌నుమాన్ మందిరాల‌ు ఉన్నాయి. ఇక్కడి సిద్దుల గుట్టకు ఎంతో ఘన చరిత్ర, ప్రాముఖ్యత ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇన్నాళ్లూ అంతగా ప్రాచుర్యం పొందని ఈ క్షేత్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాకతోనైనా సిద్దులగుట్టకు తగిన ప్రచారం కల్పించాలని కోరుతున్నారు.  ఇప్పుడు ఈ సిద్దుల గుట్టపై తొమ్మిది ఆలయాలకు శంకుస్థాపన చేయడంతో ఈ ఆధ్యాత్మిక ప్రాంతం వార్తల్లోకి వచ్చింది. శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, మరో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, సినీ ప్రముఖులు వివి వినాయక్, బెల్లంకొండ సురేశ్ తోపాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సిద్దుల గుట్టను తిరుపతి తరహాలో అభివృద్ధి చేస్తానని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. ఇక్కడి ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుంటే.. తిరుపతి వెళ్లినట్టే ఉందని కితాబిచ్చారు. సిద్దుల గుట్టపై నిర్మిస్తున్న తొమ్మిది ఆలయాలకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు ఇంద్రకరణ్ రెడ్డి.

.

,

,

మరింత సమాచారం తెలుసుకోండి: