పాకిస్తాన్‌ను చైనా అత్యంత విలువైన మిత్రదేశంగా పేర్కొంది. ఆ దేశానికి పూర్తి మద్దతును ఇస్తామని ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌ పర్యటన నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి ఈ వ్యాఖ్యలు చేసారు. చైనాలో పర్యటిస్తున్న పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ రషీల్‌ షరీఫ్‌తో సమావేశంలో వాంగ్‌ ఈ ప్రకటన చేసారు. ''పాకిస్తాన్‌... చైనాకు అత్యంత విలువైన, ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోని బంధం గల మిత్రదేశం. రెండు దేశాలు ఎదురయ్యే పరిస్థితులను పంచుకునే స్థితిలోనే ఉన్నాయి'' అని షరీఫ్‌తో వాంగ్‌ యి అన్నట్లు పాకిస్తాన్‌ సైనిక ప్రతినిధి అసిమ్‌ బజ్వా చెప్పారు. రెండోసారి పర్యటన ద్వారా భారత్‌ను ఒబామా మంచి చేసుకుంటున్న నేపథ్యంలో షరీఫ్‌ చైనా పర్యటనకు వెళ్ళారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌ ఇటు అమెరికా, అటు భారత్‌ రెండు వైపుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చైనాలో రెండు రోజుల పర్యటనలో ఉన్న షరీఫ్‌ పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ ఛైర్మన్‌ యు జెంగ్‌షెంగ్‌, సీనియర్‌ నాయకుడు మెంగ్‌ జియాంజులతోనూ సమావేశమయ్యారు. కమ్యూని స్టుపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడైన మెంగ్‌ పాకిస్తాన్‌ పట్ల చైనా నిలకడైన విధానాన్ని అనుసరిస్తుందని హామీనిచ్చారు. పాకిస్తాన్‌ ఆందోళనను చైనాదిగా భావిస్తామని చెప్పారు. ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ అయిన బజ్వా ట్విట్టర్‌లో ఈ విషయం ఉంచారు. పాకిస్తాన్‌ వైపు చైనా నిలబడుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్‌కు చైనా ప్రభుత్వం, ప్రజలు సాయపడతారని జెంగ్‌షెంగ్‌ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: