సైన్సు ఎంతగా అభివృద్ది చెందుతున్నా.. కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు ఇంకా సమాజంలో ప్రబలంగా వేళ్లూనుకున్నాయి. వాటిలో వాస్తు ఒకటి. ఐతే.. ఇది నమ్మకమో, విశ్వాసమే కాదు.. ఇది కూడా ఓ సైన్సే అనే వారు ఉన్నారు. అది విశ్వాసమైనా, శాస్త్రమైనా.. కాకపోయినా.. వాస్తు చూడకుండా భవనాలు, ఇతర నిర్మాణాలు కట్టేవారు చాలా అరుదు. మరి అలాంటిది ఏకంగా రాజధాని నిర్మాణంలో వాస్తు పాత్ర లేకుండా ఉంటుందా.. ? అసలు వాస్తు కోసమే.. బంగారంలా మూడు పంటలు పండే గుంటూరు జిల్లా జరీబు భూములను కూడా రాజధాని కోసం తీసుకుంటున్నారన్నసంగతీ తెలిసిందే. రాజధానికి ఉత్తరాన నది ఉండటం అనేది వాస్తుకు చాలా సానుకూల అంశమని చెబుతారు. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా.. చంద్రబాబు ఈ భూముల విషయంలో వెనక్కు తగ్గలేదు. ఇప్పుడు చంద్రబాబు నిర్ణయాన్ని తెలంగాణ సీఎం, ఇతర నేతలు కూడా సమర్ధిస్తున్నారు. గణతంత్రవేడుకల రోజు.. ఆనవాయితీగా సాయంత్రం గవర్నర్ ఏర్పాటు చేసే ఎట్ హోం కార్యక్రమంలో దీనిపై చర్చ వచ్చింది. మీ రాజధాని వాస్తు చాలా బావుంది.. అన్నీ చూసే పకడ్బందీగా రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించారు కదా.. అని కేసీఆర్ చంద్రబాబుతో అన్నట్టు తెలుస్తోంది. రాజధానికి ఉత్తరాన నది ఉండటం మంచిది. ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తే త్వరగా అభివృద్ధి చెందుతుందని కేసీఆర్ చంద్రబాబుకు సలహా ఇచ్చారట. ఇంతలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా కలుగజేసుకుని.. రాజధానికి ఉత్తరాన నది ఉంటే మంచిది. మీ రాజధాని త్వరగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పారట. నిత్యం కస్సుబుస్సులాడుకునే ఇద్దరు సీఎంలు మొత్తానికి ఏపీ వాస్తు విషయంపై మాత్రం ఒకే అభిప్రాయంతో ఉన్నారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: