జాతీయ జెండా, జాతీయగీతం, జాతీయ పండుగలు.. ఇవి దేశానికే గర్వకారణం. వీటి విషయంలో ఎంతటివారైనా అనుచితంగా ప్రవర్తించడం మంచిది కాదు. వీటిని అవమానించడమంటే.. మనల్ని మనం అవమానించుకోవడమే. సామాన్యులు, అసామాన్యులు అనే తేడా లేకుండా అంతా వీటిని గౌరవిచాల్సిందే. అందుకే జాతీయ పండుగల ముందు రోజు.. వీటి విషయంలో ఎలా ఉండాలో.. ఉండకూడదో తెలుపుతూ ప్రభుత్వాలు ప్రకటనలు కూడా ఇస్తాయి.  మరి అలాంటింది.. ప్రభుత్వాధినేతలే వీటని అవమానిస్తే.. సంప్రదాయాలు పాటించకుండా నిర్లక్ష్యంగా ఉంటే.. ఇప్పుడు ఇలాంటి విమర్శలే తెలంగాణ సీఎం కేసీఆర్ పై వస్తున్నాయి. సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన గణతంత్రదినోత్సవ వేడుకల ముగింపు సమయంలో కేసీఆర్ అనుచితంగా ప్రవర్తించారని తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి ఉత్సవాలు జాతీయగీతాలాపనతో ముగుస్తాయి. అప్పటివరకూ గవర్నర్, సీఎం, మంత్రులు వంటి ప్రముఖులు వేదిక నుంచి వెళ్లరు.  సోమవారం జరిగిన వేడుకల్లో మాత్రం.. జాతీయగీతాలాపన కంటే ముందే కేసీఆర్ మైదానం నుంచి వెళ్లిపోయారు. ఆయనతో పాటే.. మంత్రులు, నేతలు కూడా అనుసరించారు. ఆ తర్వాత అధికారులు గుర్తు చేయడంతో మంత్రులు వెనక్కి వచ్చినా.. కేసీఆర్ వెళ్లిపోయారు. ఈ విషయం గమనించిన గవర్నర్ సతీమణి విమలానరసింహన్.. మంత్రి కేటీఆర్ ను ఈ విషయమై ప్రశ్నించారట. అదేంటి జాతీయ గీతాలాపన కంటే ముందే వెళ్తున్నారు.. అని అడిగారట. దాంతో కేటీఆర్ అబ్బే..లేదు.. ముఖ్యమంత్రిని పంపించి వస్తున్నామని బదులిచ్చారట.  ఐతే ఇదంతా అధికారుల సమన్వయ లోపం కారణంగానే జరిగిందని గులాబీనేతలు బదులిచ్చుకుంటున్నారు. వారు వేడుకలు ముగిశాయని చెప్పడంతోనే.. కేసీఆర్ వెళ్లారని.. అధికారులే పొరపడ్డారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: